హైదరాబాద్, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) : 100 బిసి కాలేజీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్ళు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ భూములు అమ్మరాదని బిసి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద విద్యార్థీని, విద్యార్థులతో కలిసి భారీ ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ… ప్రభుత్వ భూములు వేలం వేసి అమ్మాలని చూస్తుందని విమర్శించారు. ఇట్టి స్థలాలు హాస్టళ్ళు గురుకులాలు సొంత భవనాలు కట్టడానికి వినియోగించాలన్నారు. రాష్ట్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 325 కాలేజీ హాస్టళ్లు నిర్వహిస్తున్నారని, ఒక హాస్టల్కి కూడా సొంత భవనం లేదన్నారు. హాస్టళ్లు స్థాపించి 18 సంవత్సరాలు అవుతున్న ఒక దానికి కూడా సొంత భవనాలు లేకపోవడం అన్యాయమన్నారు.
అలాగే 320 బిసి గురుకులాలకు సొంత భవనాలు లేవన్నారు. వందల కోట్ల రూపాయలతో ప్లైఓవర్ బ్రిడ్జీలు, స్కై ఓవర్స్ నిర్మిస్తున్నారని, ఉన్నత చదువులు చదువుకొనే బిసి విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలనే ఆలోచన ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ సహా అనేక జిల్లాలలో కాలేజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు లభించక చదువు మానకుంటున్నారన్నారు. నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులుపడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజల ఆస్తులన్నింటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి, ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూళ్ల నిర్మాణానికి ఉపయోగించాలన్నారు. అంతే గాని అమ్మడానికి కాదన్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారని… అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాన్ని ఆపేశారన్నారు. భూములను అమ్మే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చ లేపుతామన్నారు. బిసిలకు 100 రెసిడెన్సియల్ పాఠశాలలను మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు 8500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ధర్నాలో బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్ ముదిరాజ్, మల్లేష్ యాదవ్ తదితరులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.