Addam News
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 1:35 am Posted by : Addam News

నేడు మ‌హా ర‌క్త‌దాన యజ్ఞం –సిటీ కమిషనరేట్ పరిధిలోని 37 కేంద్రాల్లో శిబిరాలు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) :      విధి నిర్వహణలో దేశం కోసం, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల నిస్వార్థ త్యాగాలను స్మరిస్తూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29 వ తేదీన ( నేడు ) బృహత్తర మెగా రక్తదాన యజ్ఞం చేపడుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో, 28 ప్రముఖ బ్లడ్ బ్యాంకుల సహకారంతో ఈ శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షకులే కాకుండా, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే సేవకులని చాటిచెప్పడమే ఈ మహోన్నత ప్రయత్నమని ఆయన వెల్లడించారు. మానవ సేవలన్నింటిలో రక్తదానం అత్యున్నతమైనదని పేర్కొన్నారు. సైన్స్ ఎంత పురోగమించినప్పటికీ రక్తాన్ని ఏ ఫ్యాక్టరీలోనూ కృత్రిమంగా తయారు చేయలేమని, తోటి మనిషి ఇచ్చే దానంతోనే ఆపదలో కొట్టుమిట్టాడుతున్న నిండు ప్రాణాలు నిలబడతాయని గుర్తుచేశారు. మన దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరమవుతున్న తరుణంలో, ఆ స్థాయిలో రక్తసేకరణ జరగకపోవడం ఆందోళనకరమన్నారు. దాతలు వెచ్చించే కొద్ది సమయం, అందించే ఒక్క యూనిట్ రక్తం రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ముగ్గురి ప్రాణాలకు సరికొత్త ఊపిరినిస్తుందని వివరించారు.

రక్తదానంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తం ఇవ్వడం వల్ల శరీరంలో కొత్త రక్తకణాలు పుట్టి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందే తప్ప ఎలాంటి నీరసం గానీ, దుష్ప్రభావాలు గానీ ఉండవని స్పష్టం చేశారు. సమాజ రక్షణ కోసం ఖాకీలు సర్వస్వాన్నీ పణంగా పెడుతుంటే, తోటి పౌరులను బతికించేందుకు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయడమే అమరవీరులకు సమర్పించే నిజమైన అంజలి అని అభిప్రాయపడ్డారు. అత్యవసర సమయాల్లో రక్తం కొరతతో ఏ ఒక్క ప్రాణమూ గాల్లో కలవకూడదంటే.. ప్రతి ఇంట్లో ఒకరు రక్తదాతగా తయారు కావాలి అని ఆకాంక్షించారు. హైదరాబాద్ కు గుండెకాయ లాంటి యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, మహిళలు, కాలనీ సంక్షేమ సంఘాలు , స్వచ్ఛంద సంస్థలు ఈ శిబిరాల్లో పోలీస్ సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.