Addam News
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 2:45 am Posted by : Addam News

ప్రముఖ కవి డాక్ట‌ర్‌.అందెశ్రీకి ఘన నివాళి – రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ సభ

రవీంద్రభారతి, న‌వంబ‌ర్ 10, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ ప్రజల హృదయాల్లో తనదైన కవిత్వంతో, పాటలతో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ కవి, గేయ రచయిత డాక్ట‌ర్‌.అందెశ్రీ స్మృతికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు డాక్ట‌ర్‌.జివి.వెన్నెల సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ రంగానికి వారు చేసిన కృషిని జూప‌ల్లి కొనియాడారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అందెశ్రీ రచించిన పలు గేయాలను ఆలపించి ఆయనకు సంగీత నివాళులర్పించారు. వేదిక మీద అందెశ్రీ పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రజా చైతన్య గీతాలు, సామాజిక స్పృహను ప్రతిబింబించే పాటలు సభికులను భావోద్వేగానికి గురిచేశాయి.

ఈ కార్యక్రమానికి డాక్ట‌ర్‌.ఏనుగు నరసింహారెడ్డి స్వాగత వచనాలు పలికారు. అనంతరం అతిథులు అందెశ్రీ సాహిత్య ప్రస్థానం, కవిత్వంలోని సామాజిక చైతన్యం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు పోషించిన పాత్ర, ప్రజల జీవితాలతో ఆయన రచనలకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంస్మరణ సభలో అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, జర్నలిస్టు పిట్టల శ్రీశైలం, అందెశ్రీ జీవిత ప్రస్థానంపై డాక్యుమెంటరీ రూపొందించిన రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ క్రియేటివ్ డైరెక్టర్ డాక్ట‌ర్‌.సింగం చరణ్ కౌశిక్, అన్నేమల్ల అనిల్, జిల్లా నాగేశ్వరరావు, సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.