దేశ స్వాతంత్య్రం కోసం అలవోకగా ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేర్లు భగత్ సింగ్, శివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్ త్రయం. మనందరికీ తెలిసినట్లు భగత్‌సింగ్ ఒక ప్రసిద్ధ విప్లవకారుడు మాత్రమే కాదు, ఆయన ఒక బహుభాషా జర్నలిస్ట్ కూడా. ప్రజలను విప్లవ పంథా వైపు ప్రేరేపించే క్రమంలో బ్రిటిష్ అధికారుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఆయన ‘ బల్వంత్ సింగ్ ’ వంటి మారుపేర్లతో విప్లవ సాహిత్యం రచించేవారు. పాత్రికేయునిగా అతని తొలి రచనలు చాలా వరకు బల్వంత్ సింగ్ వంటి మారు పేర్లతో ప్రచురించబడ్డాయి. ఇది ఎంత రహస్యంగా ఉండేదంటే, మొదట్లో అతని గురువు గణేష్ శంకర్ విద్యార్థికి కూడా భగత్ సింగ్ ద్వారా అతని కలం పేరిట ప్రచురించబడుతున్న రచనల గురించి ఏమాత్రం తెలియదు.
పాత్రికేయునిగా, అనువాదకునిగా రాణింపు :
భగత్ సింగ్ చిన్న వయసులోనే వృత్తిలోకి ప్రవేశించిన శిక్షణ పొందిన పాత్రికేయుడు. ఆయన తన పాత్రికేయ ప్రస్థానాన్ని ‘ ప్రతాప్ ’, ‘ వీర్ అర్జున్ ’ వంటి అప్పటి ప్రముఖ మీడియా సంస్థలలో అప్రెంటిస్‌గా ప్రారంభించారు. ముఖ్యంగా, భారతదేశంలో విప్లవాత్మక పాత్రికేయానికి ఆద్యుడు, దృఢమైన గాంధేయవాద రాజకీయ కార్యకర్త అయిన గణేష్ శంకర్ విద్యార్థి సంపాదకత్వంలో ఆయన తన పాత్రికేయ నైపుణ్యాలను బాగా మెరుగుపరుచుకున్నారు. స్వల్ప కాలమే అయినా, సృజనాత్మక, అర్ధవంతమైన అతని పాత్రికేయ వృత్తి, విప్లవాత్మక రాజకీయ జీవితం సమాంతరంగా నడిచాయి. ఆ యువ విప్లవకారుడి పదునైన మేధస్సును, నిష్పాక్షిక దృక్పథాన్ని గుర్తించిన గణేష్ శంకర్ విద్యార్థి, సహాయ నిరాకరణ ఉద్యమం విరమణ తర్వాత ఢిల్లీలో చెలరేగిన భారీ మత హింస నేపథ్యంలో, తీవ్రమవుతున్న మత ఉద్రిక్తతలు, అల్లర్లపై నిష్పాక్షికమైన, నిర్భయమైన, తటస్థమైన నివేదిక అందించడానికి మే 1924 లో భగత్‌సింగ్‌ను ఢిల్లీకి పంపారు. కాన్పూర్‌లో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నప్పుడు, అతను సచీంద్ర నాథ్ సన్వాల్ ఆత్మకథ “ బంధీ జీవన్ ” ( జైలు జీవితం) ను పంజాబీలోకి, ఐరిష్ విప్లవకారుడు డాన్ బ్రీన్ ఆత్మకథను “ ఐరిష్ స్వతంత్ర సంగ్రామ్ ” పేరుతో హిందీలోకి అనువదించారు. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో అనర్గళంగా రచనలు చేసిన ఆయన అడపాదడపా ఆంగ్లంలో కూడా తన కలానికి పని చేప్పేవారు. కీర్తి, ప్రతాప్, మత్వాలా, వీర్ అర్జున్ వంటి డజనుకు పైగా ప్రముఖ ప్రచురణలకు ఆయన రచనలు అందించారు. జైలు గోడలు కూడా అతనిలోని రచయితను నిలువరించలేకపోయాయి. కటకటాల వెనుక కూడా, అతని మేధోపరమైన కృషి నిరంతరాయంగా కొనసాగింది. అతని విస్తృతమైన రచనలు, అతని ప్రసిద్ధ జైలు డైరీ స్వాతంత్య్ర సమరయోధులకు సైద్ధాంతిక సాధనాలుగాను ప్రేరణాదాయకంగాను నిలిచాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రచురించబడిన కీర్తి, ప్రతాప్, మహారథి, వీర్ అర్జున్, మత్వాలా, ప్రభ, అకాలీ, చంద్, బందే మాతరం, లాంటి డజనుకు పైగా ప్రతిష్టాత్మక వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లతో ఆయనకు అనుబంధం ఉండేది.
సంపాదక బాధ్యతలు :
పాత్రికేయునిగా పరిణతి సాధించిన తరువాత ఆయన ప్రఖ్యాత పంజాబీ పత్రిక ‘ కీర్తి ’ సంపాదక బృందంలో చేరి, సీనియర్ సంపాదక బాధ్యతలను చేపట్టి ఎంతో అంకితభావంతో పనిచేశారు. మార్చి 1925 నుండి జూలై 1928 వరకు ఆయన ఒక అనుభవజ్ఞుడైన వృత్తిపరమైన పాత్రికేయుడిగా వ్యవహరిస్తూనే, తన ప్రగతిశీల భావాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా, ఆయన తన వృత్తిపరమైన బాధ్యతలను రాజకీయ అవగాహనతో సమర్థవంతంగా మేళవించడం ద్వారా భారతీయ పాత్రికేయ రంగంలోని విప్లవాత్మక సంప్రదాయానికి అత్యవసరమైన ఆదర్శవాదం, దృఢ విశ్వాసం, నైతిక బలాన్ని చేకూర్చారు. వాస్తవానికి, భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్రం ఉద్యమంలో అనేక అడ్డంకులను అధిగమించి దేశవ్యాప్తంగా వివిధ భాషలలో చిన్న వార్తాపత్రికలను నడిపిన స్వాతంత్య్ర సమరయోధుల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సింగ్ రాసిన కథనాలు ఆనాటి పాలక వర్గాల సంప్రదాయవాద ధోరణులకు తరచుగా సవాలు విసిరేవి. 1927లో ‘ కీర్తి ’ పత్రికలో ఆయన రాసిన “ కాకోరీ వీరుల పరిచయం ” ( ఇంట్రడక్షన్ టు ది హీరోస్ ఆఫ్ కాకోరీ ) అనే వ్యాసం దీనికి ఒక గొప్ప ఉదాహరణ. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యాసం పట్ల ఆగ్రహించిన బ్రిటిష్ అధికారులు, ఆయనను వేధించి అరెస్టు చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. 1927లో ‘కీర్తి’లో ప్రచురితమైన “ ఆజాదీ కి భేంట్ షహాదతేన్ ” ( స్వాతంత్య్రం కోసం త్యాగాలు ) అనే రచన ఆయన అత్యుత్తమ రచనలలో ఒకటి. జైలులో ఉన్న సమయంలో కూడా, పాత్రికేయత్వం పట్ల ఆయనకు ఉన్న గాఢమైన అనుబంధం ఏమాత్రం సన్నగిల్లలేదు. నిజానికి, ఆ సమయంలో కూడా అతని లేఖలు, వ్యాసాలు వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లలో ప్రచురితమవుతూనే ఉన్నాయి. “ నేను ఎందుకు నాస్తికుడిని ”, “ యువ రాజకీయ కార్యకర్తలకు లేఖ ”, “ జైలు నోట్‌బుక్ ” వంటి అత్యంత ప్రసిద్ధ రాజకీయ రచనలలో కొన్నింటిని ఆయన జైలులో ఉన్నప్పుడే రాశాడు.
అజ్ఞాత పాత్రికేయునిగా భగత్‌సింగ్ :
విచారకరమైన విషయం ఏమిటంటే, సింగ్ తరచుగా మారుపేర్లతో రచనలు చేయడం వల్ల, ఆయన రాసిన అనేక రచనలు చరిత్రలో నమోదు కాకుండానే కనుమరుగయ్యాయని అంటారు. తన రచనలకు ఆయన ఎక్కువగా ఉపయోగించిన మారుపేర్లు ‘ విద్రోహి ’, ‘ బిఎస్. సింధు’ , ‘ బల్వంత్ సింగ్ ’. బ్రిటిష్ వలస ప్రభుత్వ అణచివేత ధోరణి, కఠినమైన వలస పాలన నిబంధనలు, నిరంతర నిఘా నుండి తప్పించుకునే క్రమంలో, తన క్రియాశీల రాజకీయ, పాత్రికేయ జీవితంలో ఎక్కువ భాగం రహస్యంగా ( అజ్ఞాతవాసంలో ) గడపాల్సి రావడమే ఆయన ఈ పద్ధతిని అనుసరించడానికి ప్రధాన కారణం అంటారు. దురదృష్టవశాత్తూ, ఆయన జీవితంలోని అంశాలలో పాత్రికేయ వృత్తి అత్యంత తక్కువగా పరిశోధించబడిన అంశంగా మిగిలిపోయింది. అందువల్ల, క్లిష్ట సమయాలలో ఒక మార్గదర్శక పాత్రికేయుడిగా ఆయన చేసిన గణనీయమైన కృషి చాలా వరకు విస్మరించబడుతూనే ఉంది. అంతే కాకుండా, ఆయన ప్రాథమికంగా “ ఉరితీయబడిన ఒక రాజకీయ విప్లవకారుడు ” గా మాత్రమే గుర్తింపు పొందారు. చరిత్ర గమనాన్ని మార్చిన లెనిన్ వంటి గొప్ప నాయకుల జీవిత కాలాలను చదువుతూ, ఆకళింపు చేసుకుంటూ, రాజకీయాలు, సంస్కృతి, సమాజంపై ఆయనకు కలిగిన లోతైన, విమర్శనాత్మక ఆలోచన, జ్ఞానం ఆయన విప్లవాత్మక చర్యలకు ప్రేరణగా నిలిచాయని భగత్ సింగ్‌ను పాత్రికేయ కోణంలో చూసిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. అందుకే ఆయన, “ విప్లవ ఖడ్గం ” ఎప్పడూ ‘ భావాలు ’ అనే సానరాయిపై పదునుదేలుతుంది అని దృఢంగా విశ్వసించేవారు.
సింగ్ పాత్రికేయ వృత్తిని విస్మరించడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, ఒక రకమైన ప్రస్ఫుటమైన సైద్ధాంతిక పక్షపాతం అని చెప్పవచ్చు. భారతీయ పత్రికారంగ ప్రధాన చరిత్ర ప్రధానంగా ‘ జాతీయవాద ’, ‘ గాంధేయవాద ’ దృక్కోణాల నుండి వ్రాయబడింది. విమర్శనాత్మకమైన, తీవ్రమైన, మార్క్సిస్టు భావజాలం పట్ల ఒకింత మొగ్గు చూపే ఆయన పాత్రికేయం, ఆనాటి జాతీయవాదానికి, గాంధేయవాద విలువలకు అనుగుణంగా ఉండేది కాదు. అయినప్పటికీ, ఆయన రచనలు పాత్రికేయ రంగంలోని అత్యంత ప్రగతిశీలమైన, శాశ్వతమైన వారసత్వాలలో ఒకటిగా పరిగణించబడతాయి. వాటిని విద్యాపరమైన విశ్లేషణతో పరిరక్షించి, పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ అణచివేత కాలంలో, పాత్రికేయ కళ, నైపుణ్యం ద్వారా అధికార ప్రభుత్వం ముందు క్షేత్రస్థాయిలోని వాస్తవికతను ఉంచడం అనేది ఒక స్పష్టమైన, చారిత్రాత్మకమైన, రాజకీయ జోక్యం అనే సందేశాన్ని ఆయన రచనలు తెలియచేస్తాయి.
గుండె నిబ్బరం :
జైలు అధికారులు భగత్‌సింగ్‌ను ఉరితీయడానికి వచ్చినప్పుడు, ఆయన వ్లాదిమిర్ లెనిన్ గురించిన ఒక పుస్తకంలో ( “ ది లైఫ్ ఆఫ్ లెనిన్ ” లేదా “ స్టేట్ అండ్ రెవల్యూషన్ ” ) పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అధికారులు ఆయనను ఉద్దేశించి “ ఇక వెళ్ళే సమయం వచ్చింది ” అన్నప్పుడు, ఆయన వారికి ఆగమని ఒక వేలు చూపించి, “ ఆగండి. నన్ను మిగిలిన మరికొన్ని పేజీలు చదవనివ్వండి. ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడిని కలవబోతున్నాడు ” అని చదవడం ముగించిన తర్వాత, పుస్తకాన్ని మూసి, నిలబడి, “ చలో, వెళ్దాం ” అని ఉరికంబం వైపు అడుగులు వేశారు. జీవితపు చివరి క్షణాల్లో ఆయన ప్రదర్శించిన ఈ గుండె నిబ్బరం అనితర సాధ్యం కాక మరేమిటి !
ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తి అయిన బ్రిటిష్ వలస పాలనను నేరుగా ఎదుర్కోవడంతో పాటు పాత్రికేయ వృత్తిలో భగత్‌సింగ్ ప్రదర్శించిన అలుపెరుగని ధైర్యం ఆ వృత్తిలో నిబద్ధతతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఆ విధంగా విప్లవకారులు తమ అద్భుతమైన, చైతన్యవంతమైన పాత్ర పోషించిన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాట కాలంలో, భగత్‌సింగ్ పాత్రికేయ వృత్తి భారతీయ పాత్రికేయ చరిత్రలోనే అత్యంత కీలకమైన, ఆదర్శవంతమైన, వైభవోపేతమైన అధ్యాయాలలో ఒకటిగా నిలుస్తుంది అని నిస్సందేహంగా పేర్కొనవచ్చు.
నేటి సమకాలీన సమయంలో, ప్రధాన స్రవంతి మీడియాలోని కొన్ని విభాగాలు – ముఖ్యంగా కొన్ని టెలివిజన్ ఛానెళ్లు – పద్ధతి ప్రకారం అసభ్య ప్రచారాన్ని, నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తూ, పగలు రాత్రి మతతత్వ విషాన్ని వ్యాపింపజేస్తూ, దేశంలోని బహుళత్వ, లౌకిక సామాజిక నిర్మాణాన్ని అత్యంత వికృతంగా ఛిన్నాభిన్నం చేస్తున్న తరుణంలో భగత్ సింగ్ పాత్రికేయానికి మరింత ప్రాముఖ్యత, ప్రాసంగికత చేకూరుతుంది. అందువల్ల, ఆయన అమూల్యమైన కృషిని మన విద్యా, విజ్ఞాన వ్యవస్థలలో ఖచ్చితంగా చేర్చాలి. “ భిన్నత్వంలో ఏకత్వం ” అనే మూల సిద్ధాంతాన్ని తన హృదయంలో, ఆత్మలో ఇప్పటికీ నిలుపుకున్న ఈ సువిశాల భారతదేశం నలుమూలలా ఆయన కృషిని బోధించి, గౌరవించి, కొనియాడాలి.