Addam News
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 12:44 pm Posted by : Addam News

ఇక నుంచి ఇంటి వద్దకే ఆర్సీ కార్డు..!

ఇక నుంచి ఇంటి వద్దకే ఆర్సీ కార్డు..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ రవాణా శాఖ శుభవార్త అందించింది. ఇకపై వాహన డీలర్ల వద్దనే తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నూతన విధానం వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గి, అవినీతికి తావులేకుండా సేవలు అందుతాయి. ఇకపై కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (TR)తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వాహన విక్రయ డీలర్ల వద్దే పూర్తి చేసేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నూతన విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశముందని రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

సాధారణంగా వాహనం కొనుగోలు చేసినప్పుడు షోరూం డీలర్లు అన్ని రకాల పన్నులను ముందే వసూలు చేసినప్పటికీ, కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను మాత్రమే అందజేసేవారు. శాశ్వత నంబరు కోసం వాహనదారులు తమ వాహనంతో సహా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దీనివల్ల అటు సమయం, ఇటు రవాణా ఖర్చు వృథా కావడమే కాకుండా మధ్యవర్తుల ప్రమేయం పెరిగి వాహనదారులు అదనపు భారం మోయాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం డీలర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తోంది. దీనివల్ల షోరూం నుంచి వాహనం బయటకు వచ్చే సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే వెసులుబాటు కలుగుతుంది.

ఈ సరికొత్త మార్పుతో ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గడమే కాకుండా అవినీతికి తావులేకుండా సేవలు అందుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వాహనదారులకు ఇది ఊరటనిచ్చే అంశం. కొత్త సాఫ్ట్‌వేర్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇది అమల్లోకి వస్తే వాహనం కొన్న రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి, పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే ఆర్సీ కార్డు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాహన రంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలవనుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png