హైదరాబాద్, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) : యెరుకల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘ్ ( టీపీవైఎస్ ) అధ్యక్షుడు కూరాకుల కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘం ( టీపీవైఎస్ ) సర్వసభ్య సమావేశం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘ్ ( టీపీవైఎస్ ) అధ్యక్షుడు కూరాకుల కృష్ణ మాట్లాడుతూ… ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్టీ జాబితాలో రాజకీయ ప్రాతినిధ్యం, తగిన రాజకీయ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. యెరుకల సంఘాన్ని రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు బలోపేతం చేయాలని ఆయన అన్నారు. జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సంఘటితంగా హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎరుకల విద్యార్థులకు స్కాలర్షిప్లు, గురుకులాల్లో ప్రవేశాలు, పోటీ పరీక్షలకు కోచింగ్ వంటి సదుపాయాలు అందేలా కృషి చేయాలని సూచించారు.
యెరుకల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కూరాకుల కృష్ణ కోరారు. యెరుకల ఆత్మగౌరవ భవనం నిర్మించాలని, ట్యాంక్బండ్పై ఎరుకల జాతి మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ధర్మ, దేవరాయ సుధాకర్, కూరాకుల కిషన్లాల్, కూడాడి పాండు, శ్రీరాం శివకుమార్, నిమ్మ చంద్రయ్య, పుచ్చిత మల్లేష్, దేవసాని కృష్ణ, కోట సుజాత, కూరాకుల సరస్వతి, మాన్పాటి శైలజ, కూడాడి అనసూయ, ముద్దనోళ్ల శ్రీనివాస్, ముద్దనోళ్ల బాలయ్య, రాగికి అనంతప్ప, నల్లగొండ భీమమ్మ తదితరులు పాల్గొన్నారు.