హైదరాబాద్ సిటీ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్‌లో ఎన్టిఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఆదివారం తొమ్మిదవ రోజుకు చేరింది. ప్రదోష పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కల్యాణోత్సవాలు, కార్తీక దీపారాధన నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో కోటి దీపోత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ అలివేలుమంగా సార్వయ్య స్మార్థ వేదపాఠశాల, భద్రాచలం విద్యార్థుల వేదపఠనం జరిగింది. ప్రదోష వేళ ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ప్రదోష వ్రతాన్ని పురస్కరించుకుని నందీశ్వరునికి అభిషేకం చేశారు. గాయత్రిదేవి దుర్గమ్మ అలంకారంలో హారతి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆగమనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమల సిస్టర్స్ బృందం ఆలపించిన భక్తిగీతాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తగా, శ్రీ నండూరి శ్రీనివాస్ ఆధ్యాత్మిక ప్రవచనం అందించారు. వేదికపై ఉజ్జయిని మహాకాళేశ్వరునికి అభిషేకం నిర్వహించి మహాకాళ్ అలంకారం చేశారు. కంచి కామాక్షి అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి చందన అలంకరణతో అమ్మవారిని దర్శనానికి సిద్ధం చేశారు. అనంతరం మధురై మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి సమక్షంలో జరిగిన కల్యాణ వేడుక భక్తులకు కనులపండువగా నిలిచింది. కల్యాణోత్సవానికి ఛైర్మన్ దంపతులు పాల్గొని కల్యాణ సంకల్పం నిర్వహించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.సుమలత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చందన అలంకారంలో ఉన్న కంచి కామాక్షి అమ్మవారికి కోటి పసుపుకొమ్ముల అర్చన నిర్వహించారు.
ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మహారతి సమర్పించారు. ప్రాంగణంలోని బంగారు శివలింగం వద్ద ఛైర్మన్‌తో పాటు 108 మంది భక్తులు పంచహారతులు నిర్వహించారు. అనంతరం పల్లకీపై మధురై మీనాక్షి సుందరేశ్వరుల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ శ్రావ్యమానస బృందం మహిషాసురమర్దిని నృత్యరూపకంతో కూడిన కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. డాక్టర్ శ్రీహరి లోకేశ్ శర్మ బృందం, కాకినాడ నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ఫ్యూజన్ నృత్యం ప్రేక్షకులను అలరించింది. పార్వతి, భాగ్యలక్ష్మి బృందం ప్రదర్శించిన చిలుక నృత్యం, కోలా కదంబం విశేష ఆకర్షణగా నిలిచాయి. 