Addam News
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:37 pm Posted by : Addam News

అవినీతి రహిత సమాజమే ధ్యేయం – సొసైటీ ఫర్ క్రూసేడ్ అగైనెస్ట్ కరప్షన్

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :    సమాజంలో వేళ్లూనుకు పోయిన అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని సొసైటీ ఫర్ క్రూసేడ్ ఎగైనెస్ట్ కరప్షన్ ( అవినీతికి వ్యతిరేకంగా ధర్మ యుద్ధ సంఘం–రిజిస్టర్ నెం. 388/2023 ) అధ్యక్షుడు బి.శివకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ క్రూసెడ్ అగైనెస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో విచ్చల విడిగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు బి.శివకాంత్ సంస్థకు సంబంధించిన ముఖ్య సభ్యులతో కలిసి , భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం శివకాంత్ మాట్లాడుతూ… మున్సిపల్ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని కమర్షియల్ బిల్డింగ్లు, నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్న సెల్లార్ల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలే నగరంలో రద్దీ అధికం కావడంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జడుసుకునే పరిస్థితి తలెత్తిoదని, ఇప్ప టికే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అనేక అవస్థలు పడుతుండగా జీహెచ్ఎంసీ అధికారులు గన్ ఫౌండ్రి వంటి రద్దీ ప్రాంతంలో 40 అంతస్తుల భవనానికి అనుమతించడం అంటే ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పెంచేందుకు, అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కాగా బహుళ అంతస్తుల నిర్మా ణాలను నియంత్రించాల‌ని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టిన సొసైటీ సభ్యులకు మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.గిరిజా శంకర్, అంబేద్కర్ సేన సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లికార్జున్ తదితరులు ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అక్రమ సెల్లార్ల నిర్మాణం, ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా అక్రమ భవన నిర్మాణాలతో నగరంలోని ప్రజలు భవిష్యత్ గందరగోళంగా ఆరుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పోరాటాలకు తమ సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జి.విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎం.పురుషోత్తం, కోశాధికారి జి.శ్రీధర్, సంయుక్త కార్యదర్శి ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.