హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 9, ( అద్దం న్యూస్ ) : ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులు పూర్తి అండగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ( SLBC ) తో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాల రీ షెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణను తక్షణమే చేపట్టి, రాబోయే రబీ సీజన్‌కు కొత్త రుణాలను సకాలంలో మంజూరు చేయాలని అన్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్హులైన విద్యార్థులకు విద్యా రుణాలు, సామాన్యులకు గృహ రుణాలతో పాటు ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సదుపాయాలను విస్తరించాలని కోరారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి, మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బ్యాంకులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.