Addam News
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:40 am Posted by : Addam News

అల‌య్ – బ‌ల‌య్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ వేడుక‌లు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :    అల‌య్ – బ‌ల‌య్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వ‌ద్ద శ‌నివారం రాత్రి ఎంగిలి పూల బ‌తుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు తెలంగాణ ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా హాజ‌ర‌య్యారు. అల‌య్ – బ‌ల‌య్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ నాయకుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఆలేటి కవితా రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ‌తుక‌మ్మ ఆడారు. ఈ సంద‌ర్భంగా రకరకాల తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించడం, మహిళలు ఒకేచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడుతూ, సాంప్రదాయ పాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, ఐక్యత, ఆడపడుచుల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ నిదర్శనమ‌న్నారు. ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామ‌ని ఫౌండేష‌న్ చైర్ ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ తెలిపారు. అనంతరం గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బతుకమ్మలను కోలాహలంగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. పాల్గొన్న మహిళలకు ప్రసాదాలు పంపిణీ చేశారు.