Addam News
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 10:38 pm Posted by : Addam News

హైదరాబాద్ ఈడీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :      తెలంగాణ ఎస్సీ సమాజానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆరోపిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ప్రజలకు రావాల్సిన సుమారు రూ.55 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్‌తో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్నిమంగ‌ళ‌వారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ మాట్లాడుతూ… ఎస్సీ సంక్షేమానికి కేటాయించిన నిధులు, ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులు, ఎస్సీ డీఎఫ్ నిధుల వినియోగంపై సమగ్రంగా పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

పెద్దపల్లిలో కాంగ్రెస్ నాయకులు 10 స్కూటీలను పంపిణీ చేసి ఎస్సీ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంతి కిరణ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ సమాజానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ప్రజలకు కేటాయించిన నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని, ఎస్సీ యువతకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా నిధులను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నాయకులందరినీ అరెస్టు చేసి అఫ్జ‌ల్‌గంజ్ పోలీస్‌స్టేష‌న్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మహంకాళి జిల్లా అధ్యక్షులు గడ్డం నవీన్ త‌దిత‌రులున్నారు.