హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) :
చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ( ఎస్సిఆర్పిఎస్ ) రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ( షోయబ్ హాల్ ) లో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే డిసెంబర్ 7, 2026 నాటికి మూడు సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ‘ హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడం పట్ల ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు రాగాల నాగేశ్వర రావు, ఎస్సిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ సమన్వయకర్త డి.సుదర్శన్ బాబు లు మాట్లాడుతూ… 2023 ఆగస్టు 26న చేవెళ్ల వేదికగా జరిగిన ‘ ప్రజాగర్జన ‘ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజానర్సింహా, దీపదాస్ మున్సి తదితరులు ఎంతో ఆర్భాటంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ డిక్లరేషన్‌లోని 12 ప్రధాన అంశాలలో ఒక్కదానిని కూడా చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం అంటే అట్టడుగు స్థాయి ప్రజలను అభివృద్ధి పరచాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. దళితబంధు స్థానంలో ‘అంబేద్కర్ అభయహస్తం’ కింద ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ నేటికీ కాగితాలకే పరిమితమైందని నాయకులు ఆరోపించారు.
జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను పెంచుతామని, అలాగే అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేస్తామన్న ప్రకటన కూడా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటామని ‘విద్యాజ్యోతి భరోసా’ కింద 10వ తరగతి పాసైన వారికి రూ.10 వేలు, ఇంటర్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.25 వేలు, పీజీ చేసే వారికి రూ.1 లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ చేసేవారికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీని ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. అంతేకాకుండా పేద కుటుంబాలకు సాగు భూమి పంపిణీ, పోడు, అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాల పంపిణీ జరగలేదన్నారు. గిరిజన తండాలు, గూడేల అభివృద్ధికి ‘సమ్మక్క సారక్క’ పథకం ద్వారా ఏటా రూ. 25 లక్షలు, ఎస్సీల కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్లకు ఏటా రూ.750 కోట్ల చొప్పున, ఎస్టీల కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్లకు ఏటా రూ.500 కోట్ల చొప్పున కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 5 ఐటీడీఏల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి హామీలు పూర్తిగా అటకెక్కాయని అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలోని ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు మేల్కొని చేవెళ్ల డిక్లరేషన్ అంశాల అమలుకు తక్షణమే శ్రీకారం చుట్టాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు స్కై లాబ్ బాబు, చింతా సాంబ మూర్తి, మాస్టార్జీ, ప్రొఫెసర్ ఏకు తిరుపతి, ఆప్ నాయకురాలు హేమ, కె.గణేష్, భూపాల్ రావు, రుద్రారం శంకర్, నర్సింహ్మారావు, కె.వినోద్‌కుమార్, కొమురయ్య, మనోహర్, దానరి యాదగిరి, జిఎస్.వీణ, కె.క్రిష్ట వేణి, స్టాలిన్, సత్యనారాయణ, విజయ్‌బాబు, శివశంకర్, మహేందర్, రాపాక అశోక్, పరమ్జ్యోతి, ఎర్ర చంద్రమౌళి, ఎర్రోళ్ల శివయ్య, హనుమంత్ రావు తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.