Addam News
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 5:19 pm Posted by : Addam News

కొల్లూరులో సీవరేజ్ సమస్యపై సీఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్‌

కొల్లూరులో సీవరేజ్ సమస్యపై సీఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్‌
సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశం
– సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనతో కలిసి పరిశీలన

హైద‌రాబాద్‌, జులై 3, ( అద్దం న్యూస్ ) :   కొల్లూరు ప్రాంతంలో సీవరేజ్ వర్షపు నీటి కాలువ ద్వారా చెరువు, వ్యవసాయ భూముల్లోకి చేరుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి శుక్రవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తో కలిసి సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా కొల్లూరు లోని ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ కాలనీలోని 9 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ పనిచేయకపోవడంతో శుద్ధి చేయని మురుగునీటిని సమీప చెరువు, వర్షపు నీటి కాలువలోకి మళ్లిస్తున్నట్లు గుర్తించారు. అలాగే కొల్లూరు ప్రాంతంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సీవరేజ్ వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ నిర్వహణలో ఉన్న 9 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ మరమ్మతులకు అవసరమైన నిధుల కోసం సంబంధిత అధికారులకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఎండీ ఆదేశించారు. అలాగే కొల్లూరు, పరిసర ప్రాంతాలకు సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ప్రణాళికను రూపొందించి, ప్రధాన ట్రంక్ సీవర్ మెయిన్ ఏర్పాటు ద్వారా మొత్తం మురుగునీటిని సేకరించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

వర్షపు నీటి కాలువలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి హద్దులు నిర్ధారించాలని, నీటిపారుదల, రెవెన్యూ శాఖలతో కలిసి సంయుక్త సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎస్‌టీపీ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించి భూ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొల్లూరు ప్రాంతంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్‌టీపీ సీజీఎం సుజాత, ప్రాజెక్టు, ఓ & ఎం డివిజన్ అధికారులు, హౌసింగ్, నీటిపారుదల శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png