చిక్కడపల్లి, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన నిరుద్యోగులు నిర్వహించే శాంతియుత ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిరుద్యోగ జేఏసి నాయకుడు కయ్య వెంకటేష్ కోరారు. ఈ మేరకు బుదవారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఉద్యోగాలను చోరీ చేస్తుందని మండిపడ్డారు. వేలాది రూపాయల అప్లికేషన్స్ ఫీజులు వసూళ్లు చేస్తూ మన నిరుద్యోగులతో వ్యాపారం చేస్తుందని విమర్శించారు. పక్క రాష్ట్రంలో 5 సార్లు గ్రూప్-1 నోటిఫికేషన్స్, 4 సార్లు గ్రూప్-2 నోటిఫికేషన్స్, రెండో విడత జాబ్ క్యాలెండర్ ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల అవుతుంటే మన రాష్ట్రంలో ఒక్క జనరల్ నోటిఫికేషన్ రాకపోవటం బాధాకరమన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల ముందే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుత ర్యాలీకి ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత గ్రామ గ్రామాన బస్సుయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసి నాయకులు భుక్య కుమార్, ఆర్కె.వన్నర్ చోళ, సోమేష్, శ్రీను రాథోడ్, రవి తదితరులు పాల్గొన్నారు.