Addam News
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 3:22 am Posted by : Addam News

ఈ నెల 7 న నిరుద్యోగుల శాంతియుత ర్యాలీకి తరలిరండి – నిరుద్యోగ జేఏసి నాయ‌కుడు క‌య్య వెంకటేష్

చిక్క‌డ‌ప‌ల్లి, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) :    ఈ నెల 7 న నిరుద్యోగుల శాంతియుత ర్యాలీకి తరలిరావాల‌ని నిరుద్యోగ జేఏసి నాయ‌కుడు క‌య్య వెంకటేష్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల ముందే రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న నిర్వహించనున్న నిరుద్యోగుల శాంతియుత మహా ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌ చిక్కడపల్లి లైబ్రరీ ఆవ‌ర‌ణ‌లో జ‌రిగింది.  ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి నాయకుడు కయ్య వెంకటేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడే నిరుద్యోగులు గుర్తుకు రావడం బాధాకరమని అన్నారు.

గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డిఎస్‌సి, జిపిఓ, ఎఫ్‌బిఓ పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి, నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల ముందు నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన అశోక్‌న‌గ‌ర్ నుండి ధర్నాచౌక్ వరకు నిర్వహించనున్న నిరుద్యోగుల శాంతియుత మహా ర్యాలీకి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ విద్యార్థులు కిరణ్ రాథోడ్, కుమార్, రమేష్,ఆర్‌కె.వన్నర్ చోళ తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.