Addam News
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 4:51 am Posted by : Addam News

మిట్టపల్లి సురేందర్‌కు మా భూమి–డా.దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం

మిట్టపల్లి సురేందర్‌కు మా భూమి–డా.దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం
తెలంగాణను జాగృత పరిచిన కవి దాశరథి
– విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి

వనస్థలిపురం, జూలై 13, ( అద్దం న్యూస్ ) :    నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి, తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు తెలంగాణను జాగృత పరిచిన గొప్ప కవి దాశరథి అని హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. దాశరథి వంటి కవులు ఆ కాలంలో ఉర్దూ చదివినా.. తెలుగును, సంస్కృతిని కాపాడుతూ వచ్చారన్నారు. మా భూమి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ దాశరథి రంగాచార్య ప్రజా సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్‌కు అందజేశారు. హైద‌రాబాద్‌ వనస్థలిపురం ఎఫ్‌సిఐ కాలనీ కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఈ పురస్కార ప్రదానోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ తెలంగాణ గొప్పదనాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తన సాహిత్యం ద్వారా చెప్పారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆయన రచనలు, పాటలు ఎన్నిసార్లు విన్నా, చదివినా కొత్తగానే ఉంటాయన్నారు. ఆ చల్లని సముద్ర గర్భం పాటతో ప్రపంచ గమనాన్ని తెలియజెప్పారన్నారు. దాశరథి సాహిత్యంలోని ప్రతి పదం గొప్ప సందేశాన్నిస్తుందన్నారు. అంతగొప్ప పురస్కారాన్ని వర్ధమాన కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్కు అందజేయడం సంతోషకరమన్నారు. సురేందర్ రచనలు ప్రజలందరి హృదయాలను స్పృషిస్తాయన్నారు. తల్లి గురించి వారు రాసిన పాట ప్రతి మనస్సును కదిలిస్తుందన్నారు.

ప్రముఖ నటుడు సుమన్ మాట్లాడుతూ… అసలైన హీరోలు బార్డర్‌లో సైనికులే అని.. దేశ రక్షణలో వారి వల్లే మనం సుఖంగా ఉండగలుగుతున్నామన్నారు. కులాలు మతాలు విడనాడి కలిసి మెలిసి జీవిస్తూ దేశాభివృద్ధికి కృషి చేద్దాం అన్నారు. సాహిత్యం, కలలు ప్రజల్లో సమైక్య భావాన్ని పెంపొందిస్తాయన్నారు. దాశరథి ప్రజా సాహిత్య పురస్కారాన్ని అందుకుంటున్న మిట్టపల్లి సురేందర్‌కు అభినందనలు తెలిపారు. పురస్కార గ్రహీత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ… సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కష్ట జీవుల కన్నీళ్లు, కడగల్లే నా పాటకు వస్తువులు అన్నారు. డా.దాశరథి సాహిత్యం, రచనలు, పాటలు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడానికి తోడ్పడినాయన్నారు. నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టిన వారి కలం స్ఫూర్తితోనే ఇప్పటికీ ఎప్పటికీ నేను ప్రజల పక్షం నిలుస్తానని అన్నారు. మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక వారు నాకిచ్చిన ఈ దాశరథి సాహిత్య పురస్కారం నాపై బాధ్యత పెంచిందని, ఆ బాధ్యతను దాశరథి, ఇతర ప్రజా కవుల స్పూర్తితో కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి మురళీమోహన్, నరసింహ్మప్రసాద్, యానాల నాగిరెడ్డి, ఉదయశంకర్, అలివేలు మంగ, ఇంజమూరి రఘునందన్, ముసుకు పవన్ కుమార్ రెడ్డి, శరణ్య తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png