Addam News
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 1:41 am Posted by : Addam News

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

గాంధీన‌గ‌ర్‌, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో నెల‌కొల్పిన అమ్మ‌వారి మండ‌పంలో ఆదివారం ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌య ప్రాంగ‌ణంలో హోమం జ‌రిగింది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఈ మ‌హోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు అమ్మ‌వారిని శ్రీ బాల‌త్రిపుర సుంద‌రీ దేవి రూపంలో అలంక‌రించి ప్ర‌త్యేక పూజ‌లను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి పి.కొమ్మాలు మాట్లాడుతూ… 20వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు మ‌హానివేద‌న‌, మంగ‌ళ‌హార‌తి, మంత్ర‌పుష్పం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, పారాయ‌ణం త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. అలాగే ప్ర‌తి రోజు అమ్మ‌వారిని వివిధ రూపాల్లో అలంక‌రించి పూజ‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 12వ తేదీన శ్రీ అన్న‌పూర్ణాదేవి రూపంలో, 13వ తేదీన శ్రీ మంగ‌ళ‌గౌరీ దేవిగా, 14వ తేదీన శ్రీ గాయ‌త్రి దేవి రూపంలో, 15వ తేదీన శ్రీ రాజ‌రాజేశ్వ‌రీ దేవిగా, 16వ తేదీన శ్రీ మ‌హాల‌క్ష్మీ దేవిగా, 17వ తేదీన శ్రీ స‌ర‌స్వ‌తి దేవిగా, 18వ తేదీన శ్రీ దుర్గాదేవి రూపంలో, 19వ తేదీన శ్రీ మ‌హిషాసురమ‌ర్థిని దేవిగా, 20వ తేదీన శ్రీ ల‌లితాదేవి రూపంలో అలంక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.

శ్రీ బాల‌త్రిపుర సుంద‌రీ దేవి అలంక‌ర‌ణ‌లో అమ్మ‌వారు

ఈ హోమం కార్య‌క్ర‌మంలో ఆల‌య పున‌ర్నిర్మాణ క‌మిటీ ఛైర్మ‌న్ జానకి సుధాక‌ర్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు బుగ్గా ల‌క్ష్మీప‌తి శ‌ర్మ‌, అర్చ‌కుడు కందాళ వేంక‌టాద్రి, ఆల‌య పున‌ర్నిర్మాణ క‌మిటీ స‌భ్యులు శ్యామ్ కుమార్ ముదిరాజ్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కురాలు ముచ్చ‌కుర్తి ప‌ద్మ‌, భ‌క్తులు పాల్గొన్నారు.