Addam News
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 1:48 am Posted by : Addam News

వక్ఫ్‌ భూములకు రక్షణ కల్పించాలని ధ‌ర్నా

వక్ఫ్‌ భూములకు రక్షణ కల్పించాలని ధ‌ర్నా

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :   జామియా నిజామియా–రాయిదుర్గ్‌ వక్ఫ్‌ భూములను పరిరక్షించి, ఆక్రమణలు, అక్రమ బదలాయింపులను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ జామియా నిజామియా–రాయిదుర్గ్‌ వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ వక్ఫ్‌ బచావ్‌ తహ్రీక్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ వహాబ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వివిధ సంఘాల ప్రతినిధులు, మత పెద్దలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ ధర్నాలో అమ్జదుల్లా ఖాన్‌, ఖాజా బిలాల్‌, అబ్రార్‌ హుస్సేన్‌ ఆజాద్‌, సైఫుల్లా ఖాన్‌, మొహమ్మద్‌ ముస్తఫా, మొహమ్మద్‌ అబ్బాస్‌, మొహమ్మద్‌ మొయిన్‌, మాన్సూర్‌ షా, హబీబ్‌ ఒమర్‌, ఆసియా నబీహా, మౌలానా షఫీ మసండీ, ఖలీదా పర్వీన్‌, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… హైదరాబాద్‌ రాయిదుర్గ్‌–పన్మక్త ప్రాంతంలోని సర్వే నంబర్‌ 83/1లోని వక్ఫ్‌ భూములపై కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీజీఐఐసీ వేలం ప్రక్రియలోకి వెళ్లిన సుమారు 10.63 ఎకరాల భూమికి సంబంధించిన సుమారు రూ.2,889 కోట్ల విలువను జామియా నిజామియాకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 రాయిదుర్గ్‌లో మిగిలిన సుమారు 500 ఎకరాల వక్ఫ్‌ భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, డిమార్కేషన్‌ చేసి ప్రహరీ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ భూముల రికార్డులను డిజిటలైజ్‌ చేసి భద్రపరచాలని కోరారు. జామియా నిజామియా ప్రతిపాదించిన స్కిల్‌ అండ్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణవ్యాప్తంగా వక్ఫ్‌ ఆస్తులపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రత్యేక రక్షణ కల్పించాలని, ఈ అంశంపై శాసనసభలో చర్చించాలని జేఏసీ నాయకులు కోరారు. మీమ్‌ టీవీ ప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png