Addam News
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 7:23 am Posted by : Addam News

స్క్రబ్ టైఫస్ సోకితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఇటీవలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి డెంగ్యూ, మలేరియా లాంటి లక్షణాలు కలిగి ఉండడం వల్ల చాలా మంది తొలుత గందరగోళానికి లోనవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని తీవ్రతను గుర్తించి అధికారులను అప్రమత్తం చేసింది. కానీ ఈ వ్యాధి గురించి ప్రజలకు సరైన అవగాహన చాలా అవసరం.

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుట్సుగముషి అనే బాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌. ఈ బాక్టీరియా సాధారణంగా అడవి ప్రాంతాల్లో లేదా పొదల దగ్గర ఉండే ఎలుకలు, ఉడతలు, కుందేళ్ల శరీరంపై కనిపిస్తుంది. అక్కడి నుండి మనుషులకి ఇది *ఇన్‌ఫెక్టెడ్ లార్వల్ మైట్* లేదా చిన్న పీను కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బుష్ టైఫస్ అనే పేరుతో కూడా పిలువబడుతుంది.

వ్యాధి లక్షణాలు

స్క్రబ్ టైఫస్ సోకిన 6 నుండి 10 రోజుల్లో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రధానంగా గమనించదగ్గవి:

– అకస్మాత్తుగా వచ్చే జ్వరం
– తలనొప్పి, శరీర నొప్పులు
– వణుకు, బలహీనత
– చర్మంపై దద్దుర్లు
– కీటకం కుట్టిన ప్రదేశంలో చర్మం నల్లటి మరకలా మారడం
– తీవ్రమైన పరిస్థితిలో లివర్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ కి అవకాశం

ఈ లక్షణాలు డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్‌లాంటిలా కనిపిస్తాయి కనుక వైద్యులు రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు.

నిర్ధారణ విధానం

స్క్రబ్ టైఫస్ గుర్తించడానికి సాధారణంగా ELISA టెస్ట్ చేస్తారు. ఇది రక్తంలో ఉన్న యాంటీబాడీల ద్వారా ఇన్ఫెక్షన్‌ ఉన్నదో లేదో చెబుతుంది. త్వరగా ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తే వ్యాధి తీవ్రమయ్యే అవకాశం తగ్గిపోతుంది.

చికిత్స, జాగ్రత్తలు

స్క్రబ్ టైఫస్‌కి ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి సమయానికి వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయవచ్చు. ఇంట్లో స్వయంగా మందులు తీసుకోవడం ప్రమాదకరం.

నివారణ చర్యలు:
– పొదలు, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండకండి.
– బట్టలు పూర్తిగా కప్పుకునే విధంగా ధరించండి.
– ఇంటి చుట్టుపక్కల శుభ్రత పాటించండి, చెత్త, పొదలు తొలగించండి.
– పురుగుమందులను పిచికారీ చేయడం ద్వారా మైట్‌లు పెరగకుండా చూడండి.
– శుద్ధమైన నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

స్క్రబ్ టైఫస్ ఒక సాధారణ జ్వరంలా కనిపించవచ్చు కానీ సమయానికి చికిత్స లేకుండా వదిలేస్తే ప్రాణాపాయం కలిగించే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి జ్వరాలపై నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png