Addam News
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:15 am Posted by : Addam News

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేలా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రొబేషనరీ డీఎస్‌పీలకు ఉద్బోధించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న దృఢమైన సంకల్పంతో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామని చెప్పారు. కొత్తగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ డీఎస్‌పీలతో ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో మంగ‌ళ‌వారం జరిగిన వ్యాలిడిక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శిక్షణ సమయంలో ట్రెయినీలు దిగిన ఫోటోల ప్రదర్శనను తిలకించారు. ‘క్రైమ్ సీన్ ఫోరెన్సిక్స్’ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొత్తగా డీఎస్పీలుగా బాధ్యతలు చేపట్టినా.. మీరొచ్చిన నేపథ్యం మరిచిపోవద్దన్నారు. మరిచిపోయిన రోజు మనం మన హోదాకు న్యాయం చేయలేమ‌న్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ స్థాయిలో ఉన్న వారైనా డీఎస్పీలు కావాలని కోరుకుని ఈ శాఖలోకి వచ్చారన్నారు. పది మంది డీఎస్పీలు అరాచకంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో పరిపాలన, ప్రభుత్వం లేదని, శాంతిభద్రతలు క్షీణించడమే కాకుండా రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు రావొచ్చన్నారు. అదే పది మంది డీఎస్పీలు నిటారుగా నిలబడి విధులు నిర్వర్తిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ పది రాష్ట్రాల్లో పెరగడానికి అవకాశం ఉంటుందని, అదే మీ నుంచి నేను ఆశిస్తున్నా అని అన్నారు. ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం ఈ శాఖలో చేరారని.. నిబద్ధతతో, బలమైన సంకల్పంతో ప్రయత్నం చేస్తే అసాధ్యమన్నది ఏదీ ఉండదన్నారు. మీ లక్ష్య సాధనలో ఇది మొదటి చాప్టర్ మాత్రమే అని.. ఇక్కడి నుంచి రెండో చాప్టర్ మొదలవుతుందని అన్నారు. పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మమేకమై పనిచేయాల్సింది మీరే అని.. మీ పనితీరే ప్రభుత్వానికి గీటురాయిగా మారుతుందన్నారు. మీరు ఉత్తమంగా పనిచేస్తే ప్రభుత్వం ప్రతిష్ట పెరగడానికి అవకాశం ఉందని.. అదే మీనుంచి నేను ఆశిస్తున్నాన‌ని తెలిపారు. కరువు, కాటకాలతో అల్లాడిన కాలంలో ఆహార ధాన్యాల కృత్రిమ కొరత సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరించడానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్‌ను చేశారన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత మేలు జరడంతో పాటు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి వచ్చిన తర్వాత నేరాల స్వరూపంలోనూ మార్పులొచ్చాయని.. కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయ‌న్నారు.

గతంలో దొంగ సారాయి కాసేవారు. .. ఇప్పుడు కొకైయిన్, హెరాయిన్, గంజాయి లాంటివి సవాలు చేసే స్థాయికి చేరుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌లో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని, ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు. ట్రాఫిక్, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నామ‌న్నారు. పోలీసు శాఖ ఏర్పడిన తర్వాత ఆయా అవసరాలకు అనుగుణంగా సీఐడీ, ఏసీబీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి విభాగాలను ఏర్పాటు చేసుకున్నామ‌న్నారు. కొత్తగా ఎంపికైన డీఎస్పీల్లో మీ నైపుణ్యాలకు అనుగుణంగా పోలీసు విభాగాలను ఎంచుకోవాల‌న్నారు. అవసరమైతే మంచి సంస్థల్లో చేర్పించి శిక్షణ కూడా ఇప్పిస్తాం. పోలీసు శాఖలో అవుట్ సోర్సింగ్ వల్ల ఆశించిన ఫలితాలు రావు. పోలీసు శాఖలో ఇన్‌హౌజ్ సామర్థ్యాలు మెరుగుపరుచుకోవాలి. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో గ్రూప్-1 నియామకాలను పూర్తి చేశామ‌ని.. 2011 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 నియామకాలు చేపట్టిన తర్వాత తిరిగి 2025 లో చేపట్టామ‌న్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నియామకాలు జరగలేదన్నారు. యువతీయువకులు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత శిఖరాలకు ఎదగాలని బలమైన ఆకాంక్షతో ఎదురుచూసే సమయంలో ఇలాంటి నియామకాల్లో జాప్యం జరిగితే ఎంతో బాధ ఉంటుందన్నారు.

గ్రూప్-1 ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టే బోర్డులో అంతకంటే కిందిస్థాయి వారిని నియమించడం తప్పిదం అని, రాజకీయ పునరావాసాలు మరెక్కడైనా కల్పించవచ్చన్నారు. కానీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నియామకాలు చేపట్టాల్సిన సర్వీస్ కమిషన్‌లో ఆనాటి ఉద్దేశాలు ఏమైనప్పటికీ అలాంటి తప్పిదాలు జరిగాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు చేయలేదన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఓకేసారి 562 ఖాళీలతో గ్రూప్-1 నియామకాలు పూర్తి చేశామని.. అందులో 119 మంది డీఎస్పీలుగా నియమితులయ్యారని.. నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో పారదర్శకంగా పనిచేసిందని భావిస్తున్నాన‌న్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ట్రెయినీ డీఎస్పీలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ్ఞాపికలను, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, MCRHRD వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి, హోం శాఖ కార్యదర్శి శిఖా గోయల్, రాష్ట్ర భద్రతా సలహాదారు బి.శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ పాల్గొన్నారు.