ఆధారాలతో కూడిన పత్రాలు ఈడీ అధికారులకు సమర్పణ
– విచారణ చేసి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 20, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) ప్రాంతీయ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎక్సైజ్ శాఖలో ఇటీవల నిర్వహించిన ఎస్సైలు, సీఐల పోస్టింగుల విషయంలోనూ అవినీతి జరిగినట్లు ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, 2020 బ్యాచ్ ఎస్సైలకు కరోనా కారణంగా కేవలం 45 రోజులే శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. మిగిలిన నాలుగున్నర నెలల శిక్షణను తర్వాత పూర్తి చేయించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే మిగిలిన శిక్షణ కాలాన్ని కుదించి కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేయించేలా కమిషనర్ హరికిరణ్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో తన సన్నిహితులతో కలిసి ఒక్కో ఎస్సై నుంచి రూ.30 వేల చొప్పున లంచం వసూలు చేశారని ఆరోపించారు. కమిషనర్ అవినీతిని ప్రశ్నిస్తుంటే 270 మంది ఎస్సైలతో ఫిర్యాదు చేయించడం వెనుక ఆంతర్యమేమిటని రాచాల యుగంధర్ నిలదీశారు. కొత్తగా విధుల్లో చేరిన ఎస్సైల నుంచి లంచం తీసుకుంటే కమిషనరుగా ఉన్న మీరు వారికి ఏమి విలువలు నేర్పుతున్నారని ప్రశ్నించారు.
నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండానే కమిషనర్ కనుసన్నల్లో 25 బార్లు అక్రమంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. నోడల్ అధికారులకు ఉండాల్సిన డిప్యూటేషన్ల అధికారాన్ని కూడా లంచాల కోసం తన దగ్గరే పెట్టుకోవడం తన నీచ బుద్ధిని తెలియజేస్తుందని మండిపడ్డారు. క్యూటానిక్ వ్యవహారంలో తనకు నచ్చిన వారికి లోలోపల టెండర్లను అప్పగించారని, మైక్రో బ్రేవరేజులలో కూడా ఒక్కో దానికి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయన్నారు. ట్యాబ్ కొనుగోళ్లలో దాదాపు రూ. 2.50 కోట్ల కుంభకోణం జరగగా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చర్యలకు సిఫారసు చేయడమే గాక, తీసుకున్న చర్యల వివరాలను కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ మరోసారి రిమైండర్ జారీచేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ ఫైలును కూడా కమిషనర్ హరి కిరణ్ తొక్కి పెట్టడం జరిగిందని తెలిపారు.
కమీషనర్ అవినీతిపై విజిలెన్స్, ఏసీబీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశామని, సీబీ సిఐడి విచారణ కూడా కోరతామని తెలిపారు. కమిషనర్ వ్యవహారశైలి కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం పేషిలో ఉండే ఒక ఓఎస్డితో సీఎంకు తెలియకుండా కమీషనర్ అనేక తతంగాలు జరుపుతున్నాడని, అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వివి గౌడ్, గోటూరి రవీందర్, అరవిందా చారి, బత్తుల జితేందర్, దేవర శివ, కృష్ణ ప్రసాద్, రేనట్ల మల్లేష్, శ్రీధర్, ఎల్లగౌడ్, కామేష్, వెంకటేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.