Addam News
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:40 am Posted by : Addam News

ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తేనే కుటుంబ భద్రత

తార్నాక, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) :   రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న ‘ సేవా సంకల్ప్‌ అభియాన్‌ ’ లో భాగంగా మంగళవారం మెట్టుగూడ చౌరస్తాలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నిబంధనలు, సిగ్నలింగ్‌ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ… మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్‌ ధరించడం, కార్లలో సీట్‌బెల్ట్‌ పెట్టుకోవడం, మద్యం తాగి వాహనం నడపకపోవడం వంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహిస్తున్న ‘ సేవా సంకల్ప్‌ అభియాన్‌ ’ ద్వారా ప్రజాసేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సేవా సందేశాన్ని ప్రతి గడపకూ చేర్చడమే లక్ష్యమన్నారు.