ఫీజు బకాయిలు చెల్లించాలి
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకీ నిర్లక్ష్యం ?
– రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, ఆగస్టు 25, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తిచేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్ల గొర్ల మోడీ రాందేవ్ యాదవ్, నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… మూడున్నరేళ్లుగా ఫీజుల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు, ఉపకార వేతనాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. భూములు విక్రయిస్తూ, భారీగా అప్పులు తెస్తున్న ప్రభుత్వానికి పేద విద్యార్థుల చదువుల కోసం నిధులు కేటాయించేందుకు బడ్జెట్ లేదా అని ప్రశ్నించారు. ఇతర రంగాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజులను చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలలు నిలిపివేయడం సరికాదన్నారు. చదువుతున్న విద్యార్థులను ఫీజులు చెల్లించే వరకు కళాశాలలకు అనుమతించకపోవడం కూడా అన్యాయమన్నారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బలహీనవర్గాల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతోందని, దానిని పాత విధానంలోనే కొనసాగించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేసి, వాటిని చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామనే విధానం సరికాదన్నారు. చదువుకునే విద్యార్థులపై రెవెన్యూ రికవరీ నిబంధనలు ప్రయోగించడం అమానుషమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణచివేయాలని చూడటం సరికాదన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నీలం వెంకటేష్, బిసి కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, సురేష్ గౌడ్, అంజి గౌడ్, శివ యాదవ్, యశ్వంత్, బాలయ్య, నరేష్ చారి, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply