Addam News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 5:42 am Posted by : Addam News

ఎట్ట‌కేల‌కూ రాంన‌గ‌ర్ సిద్దిఖ్ అరెస్ట్‌ – గ‌ణేష్ ఆగ‌మన్ లో యువ‌కుడి మృతికి కార‌ణమైన సిద్దిఖ్ ను రిమాండ్‌కు త‌ర‌లింపు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    వినాయ‌క‌చ‌వితిని పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ 5 వ తేదీ రాత్రి హైద‌రాబాద్ శ్రీ గ‌ణ‌ప‌తి యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో జ‌రిగిన గ‌ణేష్ ఆగ‌మ‌న్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో బ‌ద్రినాథ్ ( 19 ) మృతి చెందాడు. ఈ ఆగ‌మ‌న్‌లో భాగంగా డిజే సౌండ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. ఆగ‌మ‌న్‌ను చూసేందుకు బ‌ద్రినాథ్ వ‌చ్చాడు. రాత్రి సుమారు 21:00 గంటల సమయంలో బద్రీనాథ్‌కు త‌ల్లి ఫోన్ చేయగా అతడు స్పందించలేదు. ఆ తర్వాత తన కుమారుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించినట్లు బ‌ద్రినాథ్ త‌ల్లికి సమాచారం అందింది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ అతడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు ( Brought Dead ) ధృవీకరించారు. గణేష్ ఆగమన్‌ కార్యక్రమంలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తన కుమారుడు మృతి చెందాడని అనుమానిస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతిడి త‌ల్లి కోరారు. ఆగ‌మ‌న్ కార్యక్రమ నిర్వాహకుడైన నిందితుడు మహమ్మద్ మాహెర్ సిద్ధిక్ అహ్మద్ అలియాస్ సిద్ధిక్ ( 34 ) పెద్ద ఎత్తున వేదికలు, ట్రస్సులు, భారీ లైటింగ్, అనేక రకాల బ్యాండ్‌లు, DJ/సౌండ్ సిస్టమ్‌లు, మైక్‌లను ఏర్పాటు చేశాడని.. ఈ ట్రస్సుల ఏర్పాటుకు, భారీ DJ సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి, బాణసంచా కాల్చడానికి నిందితుడు సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతులు తీసుకోలేదని విచారణలో తేలింది. పోలీసు సిబ్బంది ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ, నిర్వాహకులు అనుమతించదగిన పరిమితులకు మించి భారీ శబ్దాలతో సౌండ్ సిస్టమ్‌లను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బాణసంచా కాల్చడంతో, ప్రజల్లో ఒక్కసారిగా తొక్కిసలాట, తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి. ఈ గందరగోళంలో సౌమ్య హాస్పిటల్ సమీపంలో బద్రీనాథ్ స్పృహతప్పి పడిపోగా, అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని తెలిసి కూడా సిద్ధిక్ తన అనుచరులతో కలిసి తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించాడని, ఇది బిఎన్ఎస్ ( BNS ) సెక్షన్ 105 r/w 3 ( 5 ) కింద శిక్షార్హమైన నేరమని విచారణలో నిర్ధారణ అయింది.

ప‌రారీలో ఉన్న సిద్దిఖ్‌ను ఎట్ట‌కేల‌కూ అరెస్ట్ చేసిన పోలీసులు :
ఆగ‌మ‌న్‌లో యువ‌కుడి మృతి చెందిన నాటి నుంచి హత్యకు సమానంకాని సామూహిక నరహత్య ( Culpable Homicide Not Amounting to Murder ) కేసులో నిర్వాహ‌కుడు సిద్దిఖ్ ప‌రారీలో ఉన్నాడు. అత‌ని కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( DCP ) రక్షిత కృష్ణమూర్తి, సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె.నరసయ్య పర్యవేక్షణలో… చిక్కడపల్లి డివిజన్ ACP జి.రణవీర్ రెడ్డి, ముషీరాబాద్ ఇన్‌స్పెక్ట‌ర్ జి. రాజగోపాల్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ జోన్ బృందం, ముషీరాబాద్ పోలీసుల నిరంతర కృషి ద్వారా ఈ కేసులోని ప్రధాన నిందితుడిని ఈ నెల 4వ తేదీన రాత్రి 23:30 గంట‌ల స‌మ‌యంలో పట్టుకోవడం జరిగింది. సిద్దిఖ్ ను పోలీసులు అరెస్టు చేసి, హైద‌రాబాద్ నాంప‌ల్లి XVII ACJM కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశ‌ల మేర‌కు నిందితుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు.