Addam News
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 6:51 am Posted by : Addam News

Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

Tata-Ernakulam Express: టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విశాఖపట్నం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. టాటా నగర్ నుంచి ఎర్నాకుళం (Tata-Ernakulam Express) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు (నెం. 18189) అనకాపల్లి (Anakapalli) సమీపంలో మంటలకు గురైంది. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో రైలు నర్సింగబల్లి – ఎలమంచిలి మధ్యలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. B1 ఏసీ బోగీ బ్రేకులు పట్టేయడంతో (Brake binding) ఘర్షణ ఏర్పడి నిప్పురవ్వలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పక్కనే ఉన్న M2 బోగీకి కూడా విస్తరించాయి. మంటలను గమనించిన లోకో పైలట్లు వెంటనే రైలును ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద నిలిపివేశారు.

తప్పని ప్రాణనష్టం.. ప్రయాణికుల హాహాకారాలు

నిద్రలో ఉన్న ప్రయాణికులు పొగ రావడంతో ఉలిక్కిపడి లేచారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడక, ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. B1 బోగీలో ప్రయాణిస్తున్న విశాఖపట్నంకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీయడంతో, వారి లగేజీ, వ్యక్తిగత సామాగ్రి మొత్తం మంటల్లో బూడిదయ్యాయి.

సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి ప్రాంతాల నుండి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గురైన రెండు బోగీల్లోని ప్రయాణికులను మూడు ఆర్టీసీ బస్సుల ద్వారా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. సామర్లకోటలో రైలుకు కొత్తగా రెండు ఏసీ బోగీలను జత చేసి, అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఈ ప్రమాదం కారణంగా విశాఖపట్నం – విజయవాడ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 2 వేల మంది ప్రయాణికులు తీవ్ర చలిలో స్టేషన్‌లోనే గడపాల్సి వచ్చింది. అధికారులు దగ్ధమైన బోగీలను వేరు చేసిన అనంతరం తెల్లవారుజామున 3:30 గంటల తర్వాత ఇతర రైళ్లకు అనుమతినిచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణకు ఆదేశించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png