సామాన్య భక్తులకు 92 శాతం ప్రాధాన్యత
• రూ.2,750 కోట్లతో నిర్మించనున్నయాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ
• టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం
• స్విమ్స్‌కు అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు
తిరుమల, ( అద్దం న్యూస్ ) : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుండి 29వ తేదీ వరకు 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం టీటీడీ సాధికారిక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి SSD టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. తొలి రెండు రోజులు సర్వ దర్శనం ఉండదు. తర్వాత 8 రోజులు భక్తులకు సర్వ దర్శనం అమలు చేయడం జరుగుతుందన్నారు. అలిపిరి–ఎస్.వి. జూ పార్క్ రోడ్డుకు సమీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించనున్న యాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో భక్తులకు మెరుగైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నాట్లు తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపులో భాగంగా సీనియారిటీ జాబితా 2007 ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించడానికి ఆమోదించామన్నారు. దీంతోపాటు మిగిలిన అర్హులకు కేటాయింపు పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయంతో పాటు పాదిరేడులో ఇంటిస్థలాల అభివృద్ధిలో భాగంగా ( టీటీడీ 65 శాతం, ఉద్యోగులు/కేటాయింపుదారులు 35 శాతం ) ఇప్పటికే కేటాయించిన రూ.230 కోట్ల ధృవీకరణకు ఆమోదం తెలుపడం జరిగిందన్నారు. తిరుమలలో పారిశుద్యాన్ని మరింత మెరుగు పరచేందుకు అదనంగా 321 మంది పారిశుధ్య కార్మికులు, 27 మంది సూపర్ వైజర్లు కలిపి పొరుగు సేవల క్రింద మొత్తం 348 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదించడం జరిగిందని తెలిపారు. తిరుమలను కాలుష్య రహిత ప్రాంతంగా ( Net Zero and Carbon Neutral Destination ) అభివృద్ధి చేసేందుకు పర్యావరణ పరిరక్షణ ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆమోదంతో పాటు అందు కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ టివి. సత్యనారాయణను ఏడాది పాటు నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శ్రీవారి నిత్య కైంకర్యాలకు ప్రతిరోజూ అవసరవమైన 2000 లీటర్ల పాలు, 80 కిలోల నెయ్యిని సొంతంగా సమకూర్చుకునేందుకు 500 దేశీయ జాతి గోవుల కొనుగోలు వాటి రవాణాకు రూ.7.50 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తిరుమల–తిరుపతి అటవీ ప్రాంతాల్లో మానవ–వన్యప్రాణుల సంఘర్షణల నివారణ, భక్తుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ కోసం ( 2026-2028 ) రెండేళ్ల కాలానికి ఏపీ అటవీ శాఖకు రూ.16.40 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదించడం జరిగిందన్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి శ్రీవారిమెట్టు వరకు భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రహదారి అభివృద్ధి, ఇరువైపులా ఇంటర్ లాకింగ్ సిమెంట్ బ్లాక్‌ల నిర్మాణానికి రూ.9.50 కోట్లు మంజూరుకు ఆమోదం చేశామన్నారు. ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం ఉద్యోగులకు అందించే బ్రహ్మోత్సవ బహుమానాన్ని ఈ ఏడాది టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.8,289 చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శ్రీవారి ఆలయంలో నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ సేవలు నిర్వహిస్తున్న పారాయణదారులను ప్రోత్సహించేందుకు గాను వారికి సంభావన పెంపుతో పాటు స్విమ్స్ ఆసుపత్రిలో పేద రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బిఏఎమ్ ఎస్ ( UG ) కోర్సులో ప్రస్తుతం ఉన్న 40 సీట్లకు అదనంగా మరో 20 సీట్లు పెంచేందుకు ఆమోదం చేశామన్నారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్పకళా, వాస్తుశిల్ప సంస్థ ( SVITSA ) లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు 41,167 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.23 కోట్లతో నూతన హాస్టల్ భవనం నిర్మాణం చేపట్టేందుకు ఆమోదించామన్నారు. తద్వారా 229 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి అందుబాటులోకి వస్తుందన్నారు. టీటీడీ అగరుబత్తి యూనిట్‌లో తయారీ, ప్యాకేజింగ్, సరఫరా కోసం బెంగళూరుకు చెందిన మెస్సర్స్ పాటిల్ పరిమళ వర్క్స్ లిమిటెడ్‌కు మూడేళ్ల కాలానికి జీఎస్టీతో కలిపి సుమారు రూ.90 కోట్ల అంచనా వ్యయంతో ఎల్–1 టెండర్ ను ఆమోదించామని చైర్మన్ తెలిపారు.
తిరుచానూరు గోశాలలో విధి నిర్వహణలో ఏనుగు దాడికి గురై తీవ్రంగా గాయపడి మరణించిన ఈఎంటీఎస్ ఉద్యోగి ఎస్.చంద్రశేఖర్‌కు 15 లక్షలు, అదే విధంగా ఇటీవల మరణించిన మరో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు కె.చక్రవర్తి, ఎస్.చంద్రశేఖర్ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందజేసిన నిధులకు ఆమోదించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అర్హులైన ఉద్యోగుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక ప్రయోజనం అందేలా గ్రాట్యుటీ, బీమా, EX-Gratia తో సమగ్ర సంక్షేమ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం చేశామన్నారు. అలిపిరి నడకమార్గంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు రోడ్డుపై నడిచివచ్చే భక్తుల సౌకర్యార్థం ఐఐటీ నిపుణులు సహకారంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
ఎస్వీ విద్యాదాన ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో ఒకటి, అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్పకళాశాల ప్రాంగణాల్లో మరో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందించి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరి, జేఈవోలు డా.ఏ.శరత్, ప్రభల గోపినాథ్, సీవీఎస్‌వో మురళీకృష్ణ, చీఫ్ ఇంజినీర్ మనోహరం, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.