Addam News
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:27 am Posted by : Addam News

విద్యార్థుల ఉద్యమానికి, ఓటు హక్కుల పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు – తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల

హైద‌రాబాద్‌, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) :     దేశంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల బలోపేతం, సామాజిక న్యాయం కోసం విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) అధ్యక్షుడు డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు తమ హక్కులు, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలకు ప్రజలు సంఘీభావం ప్రకటించాలని ఆయన కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను విశ్వసించే విద్యార్థులతో పాటు ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ భావజాలం కలిగిన యువత, మార్క్సిస్టు, కమ్యూనిస్టు భావజాలాన్ని అనుసరించే విద్యార్థులు, రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరుకునే ప్రజలందరూ శాంతియుత ఉద్యమాలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. అదే విధంగా, దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జితేందర్ రావు తనుగుల స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో, ఓటు హక్కుల పరిరక్షణ కోసం సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ( CJP ) చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఓటర్ల జాబితాల సవరణ పారదర్శకంగా, చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఆయన కోరారు. అర్హులైన ఏ పౌరుడూ తన ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాటున ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడితే, బాధితులకు అభ్యంతరాలు తెలిపేందుకు, తమ పేర్లను తిరిగి చేర్చుకునేందుకు చట్టబద్ధమైన అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.

SIR ప్రక్రియలో అవకతవకలు లేదా నిర్లక్ష్యం జరిగినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో సహా ఈ వ్యవహారానికి సంబంధించి వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించాలని, తప్పిదాలు నిర్ధారణ అయిన పక్షంలో చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలు, ఓసీలు సహా అన్ని సామాజిక వర్గాల ప్రజలు విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు, అర్హులైన పౌరుల ఓటు హక్కుల పరిరక్షణకు మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలు ఏ ఒక్క కులానికి, మతానికి లేదా రాజకీయ భావజాలానికి మాత్రమే పరిమితమైనవి కావని, దేశంలోని ప్రతి పౌరుడి హక్కులు, భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఇవ్వడం, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం దేశ ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్నారు. సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం ఆధారంగా సమాజ నిర్మాణం జరగాలంటే ప్రజలంతా ఐక్యంగా నిలవాలని డాక్ట‌ర్‌.జితేందర్ రావు తనుగుల పిలుపునిచ్చారు.