Addam News
Newspaper Banner
Date of Publish : 19 February 2026, 3:16 am Posted by : Addam News

పౌర సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ‘ మైక్యూర్ ’ యాప్ ప్రారంభం

పౌర సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ‘మైక్యూర్’ యాప్ ప్రారంభం
» జీహెచ్‌ఎంసీ పౌర సేవలు ఇక ఒకే వేదికపై
» అన్ని పౌర ఫిర్యాదులకు ఏకీకృత డిజిటల్ ప్లాట్ ఫారం
» సానిటేషన్ నుంచి టౌన్‌ ప్లానింగ్ వరకు సేవలు అందుబాటులో
» రియల్ టైమ్ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం
» పారదర్శకత, జవాబుదారీ తనంతో కూడిన పాలనకు కొత్త అడుగు

హైదరాబాద్, ఫిబ్రవరి 18, అద్దం న్యూస్ :   సాంకేతికత దన్నుగా నగర పాలనను మరింత బలోపేతం చేస్తూ, పౌర కేంద్రిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ జీహెచ్‌ఎంసీ మైక్యూర్ ( MyCURE ) యాప్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. అప్లికేషన్ ప్రత్యేకతలను వెల్లడించింది. నగరంలోని పౌర సేవలను సులభతరం చేసి, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ‘ మై జీహెచ్‌ఎంసీ ’ యాప్‌కు బదులుగా రూపొందించిన ‘ మైక్యూర్ ’ యాప్ ద్వారా అన్ని పౌర ఫిర్యాదు సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులకు అనుకూలంగా రూపొందించిన ఇంటర్‌ఫేస్‌, ఫిర్యాదులపై తక్షణ స్థితిగతుల సమాచారం, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం వంటి సదుపాయాలతో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమని వెల్లడించారు.

కార్యాల‌యాల‌కు వెళ్ల‌కుండానే ఫిర్యాదులు :   

సానిటేషన్‌, వీధి దీపాలు, రహదారులు, కాల్వలు, టౌన్ ప్లానింగ్‌ తదితర అంశాలపై పౌరులు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. వాటి పరిష్కార స్థితిని యాప్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుంది. ఫీల్డ్‌ స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయం సాధించేలా బ్యాక్ ఎండ్‌ వ్యవస్థను అనుసంధానించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కేంద్రీకృత డ్యాష్ బోర్డ్‌ ద్వారా పర్యవేక్షణ సులభమవడంతో పాటు పనితీరు అంచనా వేయడంలో కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పౌర సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదికపై సమీకరించే ‘ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ ’ గా ఈ యాప్ పని చేస్తుందని, కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు వివరించారు.

‘ మైక్యూర్ ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : 

   నగర ప్రజలు ‘మైక్యూర్’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, తమ సమస్యలను నమోదు చేసి వేగవంతమైన, పారదర్శక పరిష్కారానికి సహకరించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. ఈ యాప్‌ ఆండ్రాయిడ్ ( గూగుల్ ప్లే స్టోర్ ), ఆపిల్‌ ఐఓఎస్ ( యాప్‌ స్టోర్ ) వేదికలపై అందుబాటులో ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png