Addam News
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 11:33 pm Posted by : Addam News

అన్ని రంగాలలో ప్రభుత్వం విఫలం – ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ ధ్వజం

హైద‌రాబాద్‌, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్లెల్ల కిషోర్ డిమాండ్ చేశారు. బుధ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో న‌ల్లెల్ల కిషోర్ మాట్లాడుతూ… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు ఇబ్బందులుప‌డుతున్నార‌ని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సంబంధించి గత విద్యా సంవత్సరాల బకాయిలు, కాలేజీలకు చెల్లించాల్సిన మొత్తాలు, అర్హులైన విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని.. ఫీజుల వివాదాల కారణంగా ఫీజుల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయకుండా చూడాలన్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కళాశాలల వారీగా, విద్యా సంవత్సరం వారీగా వివరాలు విడుదల చేసి.. నిధుల విడుదలకు స్పష్టమైన గడువు ప్రకటించాలన్నారు. మూసీ నది అభివృద్ధి – పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల‌న్నారు. మూసీ నది పునరుజ్జీవనం, మురుగునీటి శుద్ధి, వరద నియంత్రణ, నది పరిసరాల అభివృద్ధి వంటి అంశాలు హైదరాబాద్ భవిష్యత్తుకు కీలకమైనవని.. అయితే ఏ అభివృద్ధి ప్రాజెక్టు అయినా ప్రజల హక్కులు, చట్టబద్ధమైన ఆస్తులు, జీవనోపాధి, పర్యావరణ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయాలన్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలు ఆందోళనకు గురికాకుండా, చట్టప్రకారం నోటీసులు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం, పారదర్శకమైన పరిహారం, పునరావాస ఏర్పాట్లు కల్పించాలన్నారు. మూసీలోకి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించి పరివాహక ప్రాంతాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలన్నారు. సెక్షన్ 22-A నిషేధిత భూముల జాబితా – నిజమైన ఆస్తి యజమానులకు న్యాయం చేయాల‌న్నారు.

సెక్షన్ 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పలువురు ఆస్తి యజమానులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు ఎదురైతే కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు, ఆస్తుల విక్రయాలు, రుణాలు, వారసత్వ లావాదేవీలు ప్రభావితమవుతాయన్నారు. ప్రభుత్వమే సెక్షన్ 22-A జాబితాలో తప్పులను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల సమస్యలు – ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయిలో పరిష్కారాలు కావాలి. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగాలంటే రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, చెత్త నిర్వహణ, వీధి దీపాలు, ట్రాఫిక్ నియంత్రణ, వర్షపు నీటి పారుదల వంటి మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉండాలన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు, గుంతల సమస్య, వర్షపు నీరు నిలిచిపోవడం, డ్రైనేజీ పొంగిపొర్లడం, చెత్త పేరుకుపోవడం, దోమల సమస్య, తాగునీటి సరఫరాలో అంతరాయాలు వంటి అంశాలపై ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న సందర్భాల్లో, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు – హామీలకు బదులుగా స్పష్టమైన నియామక క్యాలెండర్ ప్రకటించాలని కిషోర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యను పూర్తి చేసిన యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ నియామక ప్రక్రియల్లో ఆలస్యం, నోటిఫికేషన్లపై స్పష్టత లేకపోవడం, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అనిశ్చితి వల్ల అభ్యర్థులలో ఆర్థిక, మానసిక ఒత్తిడి పెరుగుతుందని, అదే విధంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు మెరుగుపర్చాలన్నారు. పై అంశాలన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, పలు అంశాల్లో ప్రజలకు స్పష్టమైన పరిష్కారాలు అందించాలని, ప్రజా సమస్యలు హామీల అమలుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాలరాజ్ గౌడ్, శ్యామ్ సుందర్, తడక వినోద్, భాను ప్రకాష్, కరణం కరణ్, ఎస్.ప్రకాష్, శక్తిప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.