హైదరాబాద్, నవంబర్ 20, ( అద్దం న్యూస్ ) : జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. జర్నలిస్టుల ఇళ్ళస్థలాల పోరాటానికి తన మద్దతు ఉంటుందని,ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధనకై గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా లో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… పేద ప్రజల మాదిరిగా జర్నలిస్టులు కూడా పేదలేనని, వీరికి కూడా ప్రభుత్వం ఇళ్ళస్థలాలు ఇవ్వాలని కోరారు. ధర్నాకు అధ్యక్షత వహించిన సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ళస్థలాల కోసం 18 ఏళ్ళుగా సొసైటీ పోరాడుతుందని, గత ప్రభుత్వాలు ఇళ్ళస్థలాలు ఇవ్వకుండా మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. జర్నలిస్టు సంఘం పేరుతో కొందరు సోకాల్డ్ జర్నలిస్టు నాయకులు తమ సొసైటీ పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి చర్యలను సహించేదిలేదని ఆయన హెచ్చరించారు.
గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ళస్థలాలు కేటాయించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షురాలు హేమ, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ, టీజేఎస్ అధికార ప్రతినిధి సలీమ్ పాషా, నగర అధ్యక్షుడు ఎం.నర్సయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు ఆనంచిన్ని వెంకటేశ్వర రావు, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు చంద్రమోహన్, సీనియర్ మహిళా జర్నలిస్టు ప్రియా చౌదరి తదితరులు పాల్గొని ధర్నాకు మద్దతు తెలియజేస్తూ ప్రసంగించారు. ఇంకా ఈ ధర్నాలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు శ్రీనివాస్, వి.రవికుమార్, ఎం.రవికుమార్, సొసైటీ డైరెక్టర్లు రామారావు, మహిళా జర్నలిస్టులు లక్షీ, నాగవాణి తదితరులు పాల్గొన్నారు.