Addam News
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 3:31 am Posted by : Addam News

ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి నోటిఫికేష‌న్లు వేయాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ

ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి నోటిఫికేష‌న్లు వేయాలి

– డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :      రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను అమలు చేసి ఉద్యోగాలకై నోటిఫికెషన్స్ వేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్యద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదిన జరిగే సెక్రటేరియట్ ముట్టడికి సంపూర్ణ మద్దతును తెలియ‌చేస్తున్న‌ట్లు డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలిపింది. బుధ‌వారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో నిర్వ‌హించిన డివైఎఫ్ఐ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది… కానీ ఇప్పటి వరకు కేవలం గత ప్రభుత్వ నోటిఫికేషన్లతో కలిపి 55 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఇంకా 1,45,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ను నామమాత్రంగా ప్రకటించి అమలు చేయడంలేదన్నారు. గత బిఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంతవరకు నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి రూ.4000 ల‌ నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి నేటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా అసలు నిరుద్యోగ భృతి అనే పేరు ప్రస్తావించకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి దరఖాస్తులను స్వీకరించి జూన్ రెండవ తేదీనే లబ్ధిదారులందరికీ నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి నేటికీ ఏ ఒక్కరికి కూడా పథకాన్ని అమలు చేయకుండా, నిధులు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా యూత్ డిక్లరేషన్ హామీలన్నింటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సాధనకై ఈ నెల 4వ తేదీన జరిగే చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ.జావీద్, కృష్ణా నాయక్, నాయకులు రాజు, భరత్, రాజేష్, నరేందర్, ప్రవీణ్, మల్లేష్,శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png