Addam News
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:36 pm Posted by : Addam News

పివి న‌ర‌సింహారావుకు ఘ‌నంగా నివాళులు

పివి న‌ర‌సింహారావుకు ఘ‌నంగా నివాళులు

హైద‌రాబాద్‌, జూన్ 28, ( అద్దం న్యూస్ ) :   భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పివి.నరసింహారావు 105 వ జయంతి ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పివి ఘాట్ వద్ద ఘనంగా జ‌రిగింది. ఈ స్మారక కార్యక్రమంలో పివి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి పివి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TYJF ) చాంబర్స్ కమిటీ చైర్మన్, పివి.నరసింహారావు కుమారుడు పివి.ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.జితేందర్ రావు తనుగుల, ఎం.హరి బాబు తదితరులతో కలిసి మహానేతకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పివి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ…. పివి.నరసింహారావు మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ, గౌరవం ఏమాత్రం తగ్గలేదని అన్నారు. దేశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి భారతదేశ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిన మహానేతగా పివి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. నిజాయితీ, నిస్వార్థ ప్రజాసేవ, దూరదృష్టి, సమర్థ నాయకత్వం వంటి ఆయన విలువలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, యువత వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పివి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు మహానేతకు మరోసారి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సంకల్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png