Addam News
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 10:29 am Posted by : Addam News

లిబియాలో భారతీయ కుటుంబం కిడ్నాప్‌..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆఫ్రికా దేశం లిబియాలో ఒక భారతీయ కుటుంబం కిడ్నాప్‌నకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్‌ చేసిన దుండగులు బాధితులను విడిచిపెట్టడానికి గాను రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు ధృవీకరించారు.

కిడ్నాప్‌కు గురైన కుటుంబం గుజరాత్‌ రాష్ట్రంలోని మెహసాణా జిల్లాకు చెందినదిగా గుర్తించారు. మెహసాణా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాన్షు సోలంకి తెలిపిన వివరాల ప్రకారం, కిస్మత్‌సింగ్‌ చావ్డా, ఆయన భార్య హీనాబెన్‌, వారి కూతురు దేవాన్షి ఈ దుర్ఘటనకు గురయ్యారు. పోర్చుగల్‌లో స్థిరపడ్డ కిస్మత్‌ సోదరుడు వద్దకు వలస వెళ్లాలని తొలుత ఆ కుటుంబం భావించింది.

ఇందుకోసం అక్కడి ఏజెంట్‌ సాయం కోసం యత్నించింది. ఓ ఏజెంట్‌ ద్వారా గతనెల 29న విమానంలో అహ్మదాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్లారు. అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని లిబియాలోని బెంఘాజీ నగరానికి తీసుకెళ్లారు. అక్కడే వారిని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కిడ్నాపర్లు బాధిత కుటుంబాన్ని సంప్రదించి.. రూ.2కోట్లు డిమాండ్‌ చేశారన్నారు. స్థానిక కలెక్టర్‌ ప్రజాపతికి ఈ విషయాన్ని వెల్లడించారు. దీన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png