Addam News
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 3:40 am Posted by : Addam News

బాలికలపై, మహిళలపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టాలి – ఐద్వా

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :    బాలికలపై, మహిళలపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్సులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి,రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి లు అన్నారు. బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో వారు మాట్లాడుతూ… ఈ నెల 19వ తేదీన బీహార్‌లోని జమయి లో టీనేజీ విద్యార్థిని పై అమానుష దాడి ఘటన నుండి మహిళలు భయాందోళనల నుండి తేరుకోక ముందే ఢిల్లీలో ఒక పార్కులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మహిళలను కలవరపెడుతోందన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో స్కూలు నుండి వస్తున్న ఇద్దరు బాలికలపై బైక్ పై వచ్చిన యువకులు దాడి చేశారని, మహిళలకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వ‌జ‌మెత్తారు. బేటీ బచావో అని చెప్పే మోడీ నినాదాలు ఆచరణలో బేటీ భగావో గా మారుతున్నాయని విమ‌ర్శించారు. దేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోందని ఇది కేంద్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచ దేశాలలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాల సరసన భారతదేశం చేరిందని ఇది సిగ్గుచేటన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో ఈ దాడులు మరింత పెరిగాయని, బాధితుల పక్షాన నిలవాల్సిన బీజీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిందితులను సమర్ధించడం మరింత విడ్డూరంగా ఉందని తెలిపారు. బీహార్ బీజేపీ మహిళా మంత్రి శ్రేయాసి సింగ్ మోరల్ పోలీసింగ్ చేయవచ్చని, కాస్త మర్యాదగా చేయవచ్చని సెలవిస్తున్నారని రోడ్లపై మోరల్ పోలీసింగ్ చేసే హక్కు ఎవరిచ్చారని ఇది వారి మనువాద భావజాలానికి నిదర్శనమని చెప్పారు. బీజీపీ నాయకుల ఇటువంటి వ్యాఖ్యానాల వల్లే నేరస్తులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఆడపిల్లలను చదువుకోవడానికి పంపడానికి కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పార్లమెంట్‌లో మహిళలు బాలికల భద్రతపై విస్తృతమైన చర్చ చేపట్టి అవసరమైన పటిష్ట చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.