Addam News
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 4:53 am Posted by : Addam News

శుభ కార్యాలలో హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలి – ట్రాన్స్ జెండర్ పీపుల్స్ అసోసియేషన్, టిపిఎస్‌కె హెచ్చరిక‌

హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ :   శుభ కార్యాలలో హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలని ట్రాన్స్ జెండర్ పీపుల్స్ అసోసియేషన్, టిపిఎస్‌కె హెచ్చరించారు. సోమ‌వారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం టిపిఎస్‌కె హాల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆల్ ఇండియా ట్రాన్స్‌జెండ‌ర్ హ‌క్కుల కార్య‌క‌ర్త రచన ముద్రబోయిన, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ట్రాన్స్ జెండర్ & హిజ్రా అసోసియేషన్ నాయకురాలు మోనాలిసా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా హిజ్రాలు శుభకార్యాల సమయంలో భిక్షాటనకు వెళ్లి అక్కడ జరిగే పూజలు,హోమాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వ్యాపార ప్రారంభాలు గృహ ప్రవేశాల్లో హిజ్రాల దీవెనలు తీసుకొని దాతలు ఇష్ట పూర్వకంగా ఇచ్చే, కట్నాలు ఎంత అయితే.. అంత తీసుకొని తిరిగి వచ్చే సంప్రదాయమ‌న్నారు. ఇది గత కొన్ని రోజులుగా అనాదిగా జరుగుతున్న తంతు దీన్ని ఆసరాగా తీసుకొని హిజ్రాలు శుభకార్యాలలో అపశృతులకు పాల్పడుతున్నారన్నారు. కోరినంత కట్నం ఇవ్వకపోయినా ఎడల నగ్న ప్రదర్శనకు దిగటం, అసభ్యంగా ప్రవర్తించి ప్రజల మనోభావాలను దెబ్బతీయటం… అంతేకాదు నోటికి వచ్చినట్లు శాపనార్ధాలు పెట్టి శుభ ప్రదమైన కార్యక్రమాలలో అపవిత్రమైన వాతావరణం సృష్టించడం మంచిది కాదన్నారు.

పెరుగుతున్న హిజ్రా జనాభాకు తగినన్ని కనీస వసతులు తెలంగాణ ప్రభుత్వం నేటికీ కల్పించలేదన్నారు. ఇల్లు లేవు.. ఉపాధి లేదని.. హిజ్రాల అంటే ? అడుక్కోవడం, వ్యభిచారం చేయడమేనా ? మనుషుల్లా మమ్మల్ని గుర్తించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వద్ద అసభ్య వ్యాఖ్యలు దిగజారుడు సంస్కృతిని, హీన సంస్కృతిని అరికట్టి తద్వారా హిజ్రా, ట్రాన్స్ జెండర్ సముదాయ హక్కులు అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా హిజ్రాల అందరికీ మనవి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 11 సంవత్సరాలు ఇద్దరు ముఖ్యమంత్రులు మారారని, ట్రాన్స్ జెండర్ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. భారత సుప్రీంకోర్టు వెలువరించిన థర్డ్ జండర్ జడ్జిమెంట్ రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. తెలంగాణ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో షీ టీంలో ఫ్రైడ్ ప్లస్ ట్రాన్స్ జెండర్ వారికి ప్రత్యేక లీగల్ క్లినిక్ ఏర్పాటు చేయాలని, పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ నాయకురాలు ఆర్.జస్మిన్, జి. గంగ, సోనీ, అనిత తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png