Addam News
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 11:05 am Posted by : Addam News

ప‌దేళ్ల పాటు ప్రాజెక్టుల‌ను ప‌డావు పెట్ట‌కుండా పూర్తి చేసి ఉంటే ఈ రోజు నీటి క‌ష్టాలు ఉండేవి కావు – సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట, ( అద్దం న్యూస్ ) :     కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, పాలమూరు – రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ, ఖమ్మం జిల్లాకు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గత పదేళ్లపాటు పడావు పెట్టకుండా పూర్తి చేసి ఉంటే ఈరోజు నీటి కష్టాలు ఉండేవి కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రజలతో కలిసి ముస్తాబాద్ చౌరస్తా నుంచి 2 కి.మీ మేర పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 నుంచి పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. సిద్దిపేట శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మదన్ మోహన్ తొలి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వారి గుర్తుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ మెడికల్ కాలేజీగా నామకరణం చేయనున్నట్టు ఈ వేదికగా సీఎం ప్రకటించారు. అందుకు సంబంధించి వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కు సూచించారు. మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన 14 గ్రామాల్లో నిజమైన లబ్దిదారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే అధికారులు ఇళ్లలోకి వస్తారని, లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ వదులుకోదని స్పష్టం చేశారు.

1983 నుంచి 2023 వరకు కొనసాగిన ప్రభుత్వాల హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని స్పష్టం చేశారు. పైగా వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడమే కాకుండా కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించామని గుర్తుచేశారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్లలోపు 50 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్, కొత్తగా రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించారు. రుణమాఫీతో పాటు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపామని చెప్పారు. సంక్షేమ పథకాలే కాకుండా 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన అంశాన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి.సుదర్శన్ రెడ్డి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.