Addam News
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 7:23 am Posted by : Addam News

ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో అక్ర‌మంగా వేసిన బోరు

ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో అక్ర‌మంగా వేసిన బోరు
ఆదివారం కావ‌డంతో బోరు వేసిన వైనం
విష‌యం తెలుసుకుని బోరు ప‌నుల‌ను నిలిపివేసిన రెవెన్యూ అధికారులు
అధికారులు వెళ్లిపోగానే మ‌ళ్లి బోరు ప‌నుల ప్రారంభం

హైద‌రాబాద్‌, జూన్ 14, ( అద్దం న్యూస్ ) :   భూగర్భ జలాల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘ వాల్టా ’ ( WALTA ) చట్టాన్ని తీసుకొచ్చినా, క్షేత్రస్థాయిలో అది కాగితాలకే పరిమితమవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ అర్ధరాత్రి వేళల్లో, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వు దినాల్లో సాగుతున్న అక్రమ బోరు తవ్వకాలు న‌గ‌రాన్ని ఎడారిగా మారుస్తున్నాయి. అనుమతులు లేవు.. నిబంధనల దూరం అంతకన్నా లేదు.. కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా బోర్లు వేస్తుంటే, స్థానిక అధికారులు మాత్రం ” మాకేం పట్టనట్లు ” వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సెల‌వు దినాల్లో బోర్లు… కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం :
సాధారణంగా బోరు బావి తవ్వాలంటే భూగర్భ జలశాఖ, రెవెన్యూ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఒక బోరుకు, మరో బోరుకు మధ్య నిర్ధేశిత‌ దూరం ఉండాలనే నియమం ఉంది. కానీ, ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ముషీరాబాద్ చేప‌ల మార్కెట్‌లో 1-6-353/1 నంబ‌ర్ గ‌ల అడ్ర‌స్సులో ఆదివారం అక్ర‌మంగా బోరును వేశారు. ప‌ని దినాల్లో అధికారులు వస్తారనే భయంతోనో, లేదా స్థానికులు అడ్డుకుంటారనే సాకుతోనో.. చాలా ప్రాంతాల్లో సెల‌వు దినాల్లో గుట్టుచప్పుడు కాకుండా బోర్లు వేశారు. స్థానికులు అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వ‌గా, ఇలా అధికారులు వ‌చ్చి ప‌నులను ఆపివేసి వెళ్లిపోగానే మ‌ళ్లి బోరు ప‌నుల‌ను ప్రారంభించారు.

ఎండిపోతున్న పాత బోర్లు :
అనుమతి లేకుండా పక్కపక్కనే కొత్త బోర్లు వేయడం వల్ల, ఇది వ‌ర‌కే ఉన్న‌ పాత బోరుల్లో నీటి మట్టం పాతాళానికి పడిపోతోంది. ఇప్ప‌టికే బ‌స్తీలో ఒకరి మోటార్ల వల్ల మరొకరికి నీళ్లు రాకపోవడంతో స్థానికంగా నిత్యం జలవివాదాలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అరాచకాలు సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా బోరు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png