Addam News
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 3:18 am Posted by : Addam News

సిసి రోడ్ల ప్యాచ్ వ‌ర్క్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టండి – డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుష్ప‌ల‌త‌కు టిడిపి నాయ‌కుల విన‌తి

ముషీరాబాద్‌, న‌వంబ‌ర్ 17, ( అద్దం న్యూస్ ) :     హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌ల్లో నిలిచిపోయిన సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని, రోడ్ల పై నిల్వ ఉన్న మ‌ట్టికుప్ప‌ల‌ను తొల‌గించాల‌ని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం జిహెచ్ఎంసి క‌వాడిగూడ స‌ర్కిల్‌– 40 డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుష్ప‌ల‌త‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌ల్లోని ప్రాంతాల్లో డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కారణంగా రోడ్ల పునరుద్ధరణ జరగకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులకు గుర‌వుతున్నార‌న్నారు. సుమారు ఆరు నెలల క్రితం కుమ్మరి బస్తీ, తాళ్ల బస్తీ, కుర్మా బస్తీ, ముగ్గు బస్తీ, ఉన్నికోట ప్రాంతాల్లో పాత భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ల స్థానంలో కొత్త పైప్‌లైన్లు జరిగాయన్నారు. పైప్‌లైన్ల పనులు పూర్తయినప్పటికీ, తవ్విన కందకాలలో కేవలం వదులుగా ఉండే మట్టిని మాత్రమే పూడ్చిపెట్టారన్నారు. గత ఆరు నెలలుగా సిమెంట్ కాంక్రీట్ రోడ్డు ప్యాచ్ పునరుద్ధరణ పనులు ప్రారంభించలేదన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలలో రోడ్ల ప‌రిస్థితి అధ్వాన్నంగా త‌యారైంద‌న్నారు.

తవ్వకాల అనంతరం రోడ్ల నిర్లక్ష్యం, పూడ్చని కందకాలు, మిగిలిపోయిన శిధిలాలు నివాస ప్రాంతాలకు ప్రమాదకరంగా మారాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇరుకైన, తవ్విన వీధుల గుండ వృద్ధులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు నడవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రోడ్ల‌పై తొలగించని మట్టి కుప్పల వల్ల తీవ్రమైన ధూళి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. వర్షం కురిస్తే ఈ మట్టి తిరిగి కొత్తగా నిర్మించిన స్ట్రామ్ వాటర్, మురుగు కాలువల్లోకి చేరుతుందన్నారు. తక్షణమే సీసీ రోడ్డు ప్యాచ్ వ‌ర్క్‌ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని, ప్రధాన రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన మట్టి కుప్పలు, వ్యర్థాలను తొలగించడానికి వెంటనే శానిటేషన్ వాహనాలను ఏర్పాటు చేయాల‌ని కోరారు. డిప్యూటీ మున్సిప‌ల్ పుష్ప‌ల‌త‌ను క‌లిసిన వారిలో టిడిపి నాయ‌కులు ఎ.స‌త్య‌నారాయ‌ణ‌, ఎల్‌.ర‌వి, ముగ్గు బ‌స్తీ బాబు, ఆనంద్‌, రాములు, న‌గేష్‌, ప‌రుశురామ్ త‌దిత‌రులున్నారు.