హైదరాబాద్, నవంబర్ 4, ( అద్దం న్యూస్ ) : విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం మోపడం దారుణమని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమే అని అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై మరోసారి భారీ భారం మోపేందుకు రంగం సిద్ధమైందన్నారు. గత రెండు సంవత్సరాల ( 2022-23, 2023-24 ) ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్లు, ఆదాయ వ్యత్యాసాల సర్దుబాటు పేరుతో విద్యుత్ నియంత్రణ మండలి ( టీజీఈఆర్సీ ) ట్రూ-అప్ ఛార్జీల వసూళ్లకు ఆమోదం తెలిపిందని… దీనివల్ల దాదాపు 29 నెలల పాటు వినియోగదారులు అదనపు బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణ కారణంగా ఈ భారం నేరుగా సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లు నుంచి ఈ అదనపు వసూళ్లు ప్రారంభం కానున్నాయని, మొదటి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున దక్షిణ డిస్కం పరిధిలో వరుసగా 29 నెలల పాటు ఈ వాత కొనసాగనుందన్నారు. విద్యుత్ సంస్థల అప్పటి తప్పులు, ఆలస్యంగా లెక్కలు తేల్చడం వల్ల నాటి ఆర్థిక భారం నేడు పూర్తిగా సామాన్యులపై పడుతోందన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో వినియోగదారుల నుంచి రూ.4,222.93 కోట్లు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో రూ.1,197.30 కోట్లు రాబట్టనున్నారని తెలిపారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వినియోగదారులపైనే రూ. 3 వేల కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉందన్నారు.
ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉన్నప్పటికీ, వ్యవసాయరంగానికి సంబంధించి రూ. 2,214.99 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది… కానీ ఈ నిధులను ప్రభుత్వమే భరించకుండా, ట్రూ-అప్ ఛార్జీల రూపంలో ప్రజలపై రుద్దడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించి సరిదిద్దాల్సిన బాధ్యత డిస్కంలు, నియంత్రణ మండలిపై ఉంటుందని… నాటి తప్పులకు నేడు వేరే ప్రాంతాల్లో ఉంటున్నవారు లేదా కొత్త వినియోగదారులు మూల్యం చెల్లించాలనే నిబంధన హేతుబద్ధం కాదన్నారు. విద్యుత్ సంస్థల వైఫల్యాలను, ఆర్థిక లోపాలను ప్రజలపై రుద్దే ఈ ట్రూ-అప్ విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న ఈ అదనపు ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్లెల్ల కిషోర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్, శ్యామ్ సుందర్, తడక వినోద్, భాను ప్రకాష్, కరణం కరణ్, భవాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.