Addam News
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 7:09 am Posted by : Addam News

IND vs SA: నేడు రెండో టీ20..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తొలి టీ20లో సఫారీలను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. జోరు కొనసాగించాలనుకుంటున్న ఆతిథ్య జట్టు.. రెండో టీ20లో నేడు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ సఫారీ జట్టు కూడా బలంగానే ఉన్న నేపథ్యంలో ఈ పోరు సూర్య బృందానికి తేలికేమీ కాదు. అయితే కటక్‌లో 101 పరుగుల విజయం ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాస్వాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. ముల్లాన్‌పుర్‌లోని పీసీఏ కొత్త స్టేడియంలో ఇదే పురుషుల తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌.

మరోవైపు కెప్టెన్‌ సూర్యకుమార్‌ ఫామ్‌ కూడా ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కాలంగా నిలకడగా ఆడలేకపోతున్న అతడిపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. ఇంకొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్‌లో సూర్య జట్టును నడిపించనున్న నేపథ్యంలో అతడు పరుగుల బాట పట్టడం చాలా అవసరం. కటక్‌లో అతడు 12 పరుగులే చేశాడు. పేలవ ఫామ్‌ను అధిగమించడానికి సూర్యకు ఈ సిరీస్‌ ది చక్కని అవకాశం. రెండో టీ20 కోసం తుది జట్టులో టీమ్‌ఇండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పునరాగమనంలో తొలి మ్యాచ్‌లోనే చెలరేగడం భారత్‌కు సంతోషాన్నిస్తోంది.

కటక్‌లో కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేసిన అతడు.. మరోసారి మెరవాలని జట్టు కోరుకుంటోంది. ఇంకా అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్, దూబె, జితేశ్‌ శర్మలతో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా కనిపిస్తోంది. ఇక బౌలర్లు గత మ్యాచ్‌లో సమష్టిగా విజృంభించడం భారత్‌కు సానుకూలాంశమే. పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌తో పాటు స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌.. సఫారీ జట్టును దెబ్బతీశారు. వీళ్ల నుంచి మరో అదిరే ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. బౌలింగ్‌లోనూ భారత్‌ మార్పులు చేయకపోవచ్చు.

దక్షిణాఫ్రికా పట్టుదలతో..: తొలి మ్యాచ్‌లో ఘోరపరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా.. లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉంది. ఆ జట్టును భారత్‌ తేలికగా తీసుకుంటే పొరపాటే.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్, గిల్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్, శివమ్‌ దూబె, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.

దక్షిణాఫ్రికా: డికాక్, మార్‌క్రమ్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, డొనోవన్‌ ఫెరీరా, యాన్సెన్, సిపమ్లా, కేశవ్‌ మహరాజ్, ఎంగిడి, నోకియా.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png