Addam News
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 3:48 am Posted by : Addam News

అదనపు గోదావరి జలాల వినియోగానికి ఇప్పటి నుంచే మౌలిక వసతులు సిద్ధం చేయాలి –జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి

తట్టిఖానా, బంజారాహిల్స్ రిజర్వాయర్లను పరిశీలించిన జలమండలి ఎండీ
# అగ్రసేన్ సర్కిల్–తట్టిఖానా మధ్య ప్రతిపాదిత 900 మి.మీ. ప్రధాన పైప్‌లైన్ అలైన్‌మెంట్ పరిశీలన
# కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వివిధ జలవనరుల అనుసంధానానికి మిస్సింగ్ లింకుల గుర్తింపు
# ట్యాంకర్ల ప్రయాణ, ఫిల్లింగ్ సమయం తగ్గించేలా అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి
# భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలి
– జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి

హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) :     సంవత్సరం 2027 చివరి నాటికి నగరానికి అందుబాటులోకి రానున్న అదనపు గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నీటి సరఫరా మౌలిక వసతులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తట్టిఖానా, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంగణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటి సరఫరా వ్యవస్థ, ప్రతిపాదిత పైప్‌లైన్లు, ట్యాంకర్ ఫిల్లింగ్ సదుపాయాలు, భవిష్యత్ అవసరాలపై అధికారులతో సమీక్షించారు.

తట్టిఖానాకు నీటి సరఫరా సామర్థ్యం పెంపు :
అగ్రసేన్ సర్కిల్ నుంచి తట్టిఖానా రిజర్వాయర్ వరకు ప్రతిపాదించిన 900 మి.మీ. వ్యాసం గల ఎంఎస్ ప్రధాన పైప్‌లైన్ అలైన్‌మెంట్‌ను ఎండీ పరిశీలించారు. ఈ పైప్‌లైన్ ద్వారా ప్రశాసన్‌నగర్ రిజర్వాయర్ మెయిన్, వెంకటగిరి రిజర్వాయర్ ఇన్‌లెట్ మెయిన్‌లను పరస్పరం అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. ఈ అనుసంధానంతో తట్టిఖానా రిజర్వాయర్‌కు నీటి సరఫరా మరింత బలోపేతం కావడంతో పాటు 2027 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అదనపు గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.

ట్యాంకర్ల ప్రయాణ సమయం తగ్గేలా కొత్త ఫిల్లింగ్ పాయింట్లు :
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమల్లో ఉన్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా అనువైన ప్రాంతాల్లో కొత్త ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లను గుర్తించాలని ఎండీ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఫిల్లింగ్ పాయింట్లపై ఒత్తిడి తగ్గడంతో పాటు ట్యాంకర్లు వేగంగా ప్రజలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అదే విధంగా ట్యాంకర్‌కు నీరు నింపే సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన చోట్ల పంపింగ్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ మిస్సింగ్ లింకుల గుర్తింపు :
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అందుబాటులో ఉన్న వివిధ జలవనరులను పరస్పరం అనుసంధానించి అవసరాన్ని బట్టి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీటిని మళ్లించేందుకు వీలుగా మిస్సింగ్ లింకులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. తద్వారా నీటి సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా, అవసరాలకు అనుగుణంగా పనిచేసేలా చూడాలన్నారు. 2027 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అదనపు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి అనువైన స్థలాలను ఇప్పటి నుంచే గుర్తించాలని స్పష్టం చేశారు.

బంజారాహిల్స్ రిజర్వాయర్‌లో సదుపాయాల మెరుగుదల :
అనంతరం బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎండీ, ప్రతిపాదిత కాంపౌండ్ వాల్ నమూనాను పరిశీలించారు. ప్రాంగణంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లను అనువైన ప్రాంతాలకు మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధిక సామర్థ్యం కలిగిన భారీ ట్యాంకర్లకు ప్రత్యేకంగా డెడికేటెడ్ ఫిల్లింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ట్యాంకర్లకు నీటిని నింపే ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ప్రాంగణంలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని పేర్కొన్నారు. భవిష్యత్ పరిపాలనా, నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంగణంలోనే కొత్త సెక్షన్, సబ్ డివిజన్ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అదనపు జలాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పైప్‌లైన్లు, రిజర్వాయర్లు, అనుసంధాన వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలి. అందుబాటులో ఉన్న ప్రతి జలవనరును సమర్థంగా వినియోగిస్తూ నగరానికి మెరుగైన నీటి సరఫరా అందించడమే లక్ష్యం.. అని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రభు, కిరణ్ కుమార్, పాటు సంబంధిత జీఎం తదితర అధికారులు పాల్గొన్నారు.