హైదరాబాద్, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు అవుతున్నాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ ఆరోపించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో భోలక్పూర్ మాజీ కార్పోరేటర్ వాజిద్ హుస్సేన్, లోకేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షడు రహీమ్, స్థానిక బిఎల్ఎ షేక్ జానీలతో కలిసి అరవింద్ యాదవ్ మాట్లాడారు. సర్ ప్రక్రియ పూర్తి తప్పులతడకగా సాగుతుందని, అసలు ఏ ఫారం ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఇందుకు భోలక్పూర్ డివిజన్ పరిధిలోని బూత్ నెంబరు 124లో జరిగిన ఉదంతమే నిదర్శనమన్నారు. ఇక్కడ ఓటరుగా ఉన్న బిల్కీస్ సుల్తానా అనే మహిళ బతికి ఉన్నప్పటికీ ఆమెను మరణించినట్టుగా చూపుతూ ఫారం 7 ద్వారా ఆన్ లైన్ నమోదు చేయడం జరిగిందన్నారు. పైగా బతికి ఉన్న బిల్కీస్ సుల్తానా చనిపోయిందని ఐదేళ్ళ క్రితం 2021లోనే మరణించిన ఆమె భర్త రఫీయుద్దీన్ ఫారం 7 రాసి, సంతకం చేసి దరఖాస్తు చేయడం ఎలా సాధ్యమన్నారు. ఫారం 7 లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం వల్ల ఈ అంశం వెలుగులోకి వచ్చిందని, తాను బతికి ఉన్నానని సంబంధిత పత్రాలతో బిల్కీస్ సుల్తానా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అసలు బతికి ఉన్న సుల్తానా చనిపోయినట్టు ఐదేళ్ల క్రితమే మరణించిన భర్త ఎలా సంతకం పెట్టాడో ఎన్నికల సంఘం అధికారులు చెప్పాలని అరవింద్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. భోలక్పూర్ లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 248 వరకు ఫారం 7 దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఇదంతా ఒక కమ్యూనిటీనీ లక్ష్యం చేసుకుని కుట్ర చేస్తున్నారనీ ఆరోపించిన ఆయన సర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు.