Addam News
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:30 am Posted by : Addam News

త్యాగశీలి, ఆచరణాత్మక రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ – పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ ఉద్యమ వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర‌ సమరయోధుడు గద్దెనెక్కిన త్యాగశీలి, ఆచరణాత్మక రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తిరాజ్ ట్ర‌బ్యున‌ట్ మాజీ స‌భ్యుడు, తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్‌లో కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జయంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై బాపూజీ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… చేనేత కార్మికుల సంక్షేమం కోసం ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారన్నారు.

హైదరాబాద్‌లో ‘అఖిల భారత పద్మశాలి సంఘం’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాక, మ‌హాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్య్ర ఉద్య‌మంలో పాల్గొన్నార‌న్నారు. శాసనసభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ పదవులు నిర్వహించిన ఆయన, ఏ పదవిలో ఉన్నా ప్రజల పక్షానే నిలబడ్డారన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం ఏనాడూ రాజీపడలేదని, 1952 నాన్-ముల్కీ ఉద్యమం నుండి మొదలుకొని, 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం వరకు ఆయన ముందుండి నడిపించారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడం కోసం 1969లో మంత్రి పదవికి, తన శాసనసభ్యత్వానికి సైతం ఇట్టే రాజీనామా చేసిన త్యాగశీలి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ద్మ‌శాలి సంఘం నాయ‌కులు ఎయిర్‌టెల్ రాజు, పున్న స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.