సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతను ప్రతిబింబించే గొప్ప వేడుక అలయ్-బలయ్
– మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, అక్టోబర్ 19, ( అద్దం న్యూస్ ) : సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతను ప్రతిబింబించే గొప్ప వేడుక అలయ్-బలయ్ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే “దత్తన్న అలయ్–బలయ్ – 2026 పాట” కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు, నల్గొండ గద్దర్‌గా ప్రసిద్ధిగాంచిన నర్సీ రెడ్డి ఆలపించిన అలయ్–బలయ్ – 2026 పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ రాంనగర్‌లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో జరిగింది. అలయ్–బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ హాజరై అలయ్–బలయ్-2026 పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… తెలంగాణ కళలు, జానపద గేయాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. అలయ్–బలయ్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నర్సీ రెడ్డి ఆలపించిన ఈ గీతం ప్రజల్లో సోదరభావాన్ని, తెలంగాణ సంస్కృతిపై అభిమానాన్ని మరింత పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలయ్–బలయ్ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయత, సోదరభావాన్ని ప్రతిబింబించే గొప్ప సాంస్కృతిక వేడుక అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయతను పంచుకోవడమే అలై బలై ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

అలయ్–బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మీ మాట్లాడుతూ… ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దత్తన్న అలయ్–బలయ్-2026 వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయ్–బలయ్ ఫౌండేషన్ సభ్యులు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దసరా దేవీ శరన్నవరాత్రులలో భాగంగా విజయదశమి సందర్భంగా బండారు దత్తాత్రేయ, బండారు విజయలక్ష్మీ లు ఆయుధ పూజ నిర్వహించారు.
