ప్రభుత్వ పాఠశాల భూమిని రక్షించుకుందాం
» కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి
బాగ్‌లింగంపల్లి, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్‌లోని ఎల్ఐజీ హౌసింగ్ బోర్డులో 500 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భూమిని రక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలో స్థానికులతో కలిసి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కొన్ని ఏళ్ల క్రితం లే అవుట్ చేసిన సమయంలోనే ఈ స్థలాన్ని పాఠశాలకు కేటాయిస్తున్నట్టు లే అవుట్ పత్రాల్లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి లే అవుట్ ఖరారైన తర్వాత దాన్ని మార్చే హక్కు ఎవరికీ ఉండదని, హౌసింగ్ బోర్డుకు ఏమాత్రం అధికారం లేకపోయినా ఈ 500 గజాల స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ టెండర్ల ద్వారా అమ్మేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ అమ్మకం టెండర్లను రద్దు చేసేలా హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజాప్రతినిధులైన స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత సికింద్రాబాద్ స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్తామని తెలిపారు.
అంతే కాకుండా ఈ విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, హౌసింగ్ బోర్డు మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులందరి సహాయ సహకారాలు, వారి నిధుల ( ఫండ్స్ ) ద్వారా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని ప్రైవేట్ పరం కానివ్వబోమని స్పష్టం చేస్తూ, అన్ని పార్టీలను కలుపుకొని జేఏసీ ( JAC ) గా ఏర్పడి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. హౌసింగ్ బోర్డు వెంటనే ఈ భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించుకోకపోతే విద్యార్థులు, బస్తీవాసులు, కాలనీవాసులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐజీ అధ్యక్షుడు సిరిగిరి కిరణ్, శ్రీరామ్‌నగర్ బస్తీ అధ్యక్షుడు సురేష్, స్థానిక మహంకాళి దేవాలయ అధ్యక్షుడు వెంకటేష్, స్థానికులు రాకేష్, రాజు, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply