Addam News
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:24 am Posted by : Addam News

కోటి దీపాలు వెలిగించడం అంటే జగతికి వెలుగు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 19, ( అద్దం న్యూస్ ) :   కోటి దీపాలు వెలిగించడం అంటే జగతికి వెలుగు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం గురువారం 6వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా శంఖారావం, వేదపఠనంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. శ్రీ గణపతి సచ్చిదానంద కళాపీఠం ఆధ్వర్యంలో భక్తిగీతాలు ఆలపించగా, రామ్మోహన్ బృందం సితార్, తబల వాద్య సమ్మేళనంతో అలరించింది. డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. వేదికపై షిర్డీ సాయి నిజపాదుకా పూజ నిర్వహించడంతో పాటు భక్తులచే సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ప్రాంగణంలోని బంగారు శివలింగం ఛైర్మన్‌తో పాటు 108 మంది భక్తులు పంచహారతులు సమర్పించారు. కల్పవృక్ష వాహనంపై ధర్మపురి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు.
పీఠాధిపతుల అనుగ్రహభాషణం, ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతులు, భక్తులు సామూహికంగా కార్తిక దీపారాధన నిర్వహించారు. సప్తతి, మహానీరాజనం, పీఠాధిపతులకు గురువందనం కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత సాయికుమార్ బృందం జానపద నృత్య ప్రదర్శన, సౌందర్య బృందం కథక్ నృత్య ప్రదర్శన, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మయూర విన్యాసం, కోలాట కదంబం కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు రామకృష్ణ మఠాల స్వామీజీలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ… దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవతా విగ్రహాలను ఇక్కడకు తీసుకు వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కోటి దీపోత్స‌వం అనేది ఆధ్యాత్మిక మహా యజ్ఞం అని అన్నారు. దీపం వెలిగించడం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమే అని అన్నారు. ఒక దీపం వెలిగిస్తే మన ఇంటికి వెలుగు అని పేర్కొన్నారు.