Addam News
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 12:11 pm Posted by : Addam News

RTO పోలీసుల అక్రమ దాడులు, వేధింపులను వెంటనే నిలిపివేయాలి

జీడిమెట్ల , అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) :     RTO పోలీసుల అక్రమ దాడులు, వేధింపులను వెంటనే నిలిపివేయాలని BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ( BPTMM–BMS ) తెలంగాణ ఆధ్వర్యంలో బాలానగర్–జీడిమెట్ల స్టీల్ ట్రక్ అండ్ డిసిఎం ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం ఆదివారం జ‌రిగింది. ఈ సమావేశంలో BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి ఆధ్వర్యంలో నూతన యూనియన్ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడంతో పాటు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా BPTMM జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ… ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు తగిన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలోని డ్రైవర్లు, కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ మొదటి వారంలో ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రైవేట్ రవాణా రంగంలోని డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం BPTMM–BMS ఆధ్వర్యంలో నవంబర్ 19 న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న దేశ వ్యాప్త డ్రైవర్ల మహాధర్నా “ చలో ఢిల్లీ  ” కార్యక్రమంలో డ్రైవర్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చారు. జీడిమెట్ల స్టీల్ మార్కెట్‌లో పనిచేస్తున్న ఓనర్ కమ్ డ్రైవర్లందరినీ యూనియన్‌లో సభ్యులుగా చేర్చేందుకు విస్తృత స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని స‌మావేశం తీర్మానించింద‌న్నారు. బాలానగర్–జీడిమెట్ల స్టీల్ ట్రక్ అండ్‌ DCM ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ అధ్య‌క్షుడిగా అన్వ‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జావేద్‌, కోశాధికారిగా ధీర‌జ్‌సింగ్‌ల‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో BPTMM–BMS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి, యూనియ‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.