ఈ నెల 24 నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్‌ను విజ‌య‌వంతం చేయండి

ఈ నెల 24 నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల
నిరవధిక బంద్‌ను విజ‌య‌వంతం చేయండి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 22, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ( All Trade Unions JAC ) ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక బంద్‌ను జయప్రదం చేయాలని రవాణా రంగానికి చెందిన వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి నగర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెదేపా సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్, మాజీ కార్పొరేటర్ పి.బాలరాజ్ గౌడ్, టీఎన్‌టీయూసీ ( TNTUC ) రాష్ట్ర కమిటీ మాజీ అధ్యక్షుడు ఎంకె.బోస్ తదితరులు బంద్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వ ఆర్టీసీ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన రవాణా రంగం ఆటో, క్యాబ్ వ్యవస్థేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా నిరుద్యోగులు బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల్లో అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలకు నిరంతరం రవాణా సౌకర్యం కల్పిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలోనూ, గ్యారంటీ కార్డులలోనూ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి తెదేపా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 సాయం అందిస్తుండగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.12,000 ఆర్థిక భరోసా హామీని ఇంత వరకు నెరవేర్చలేదని విమర్శించారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 2013 ఉమ్మడి ప్రభుత్వ హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో మీటర్ ఛార్జీలను పెంచిందని, ఆ తర్వాత గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ధరలు పెంచేందుకు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అధికారంలోకి రాగానే మీటర్ ఛార్జీలు పెంచుతామని మాట ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

గత 30 ఏళ్లుగా ఆటో డ్రైవర్లు పోరాడుతున్న ” రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ” ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, డిసిఎంలు కొనుగోలు చేసే సమయంలో 2 శాతం సెస్సు వసూలు చేయడం ద్వారా, కార్మికుల సభ్యత్వ రుసుముల ద్వారా ప్రభుత్వానికి పైసా భారం పడకుండా కోట్లాది రూపాయల నిధులు సమకూరుతాయని స్పష్టం చేశారు. ఈ సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక రక్షణ లభిస్తుందని తెలిపారు. మరోవైపు ఓలా, ఊబర్, రాపిడో వంటి ప్రైవేట్ యాప్ కంపెనీలు డ్రైవర్ల నుండి ఇష్టారాజ్యంగా విపరీతమైన కమీషన్లు దండుకుంటూ కార్మికులను దోచుకుంటున్నాయని, ప్రైవేట్ సంస్థల దోపిడీకి చెక్ పెడుతూ ప్రభుత్వమే ఒక అధికారిక యాప్‌ను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, నిరవధిక బంద్ ద్వారా రవాణా వ్యవస్థ స్తంభిస్తే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆటో ట్రాలీ యూనియన్ ప్రెసిడెంట్ పి.యాదగిరి, వర్ధమాన్ మహిళా కో–ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ కనకరత్నం, శంకర్ రెడ్డి, టీఎన్‌టీయూసీ ప్రతినిధులు, వివిధ రవాణా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌కు తమ పూర్తి మద్దతు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page