Addam News
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:56 am Posted by : Addam News

అక్టోబర్ 10 న జరుగనున్న‌ ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి

బాగ్‌లింగంప‌ల్లి, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) :   అక్టోబర్ 10 న జరుగుతున్న ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయాల‌ని గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎం.ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనం జ‌రిగింది. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఠానూ నాయక్ పేరుతో నంగారా ఉత్సవాలను ఎల్బీన‌గ‌ర్ స‌హారా రోడ్‌ ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంగా గిరిజనులు కళాకారులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని గిరిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల ఉద్దేశాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్ ప్రతిపాదించిన తీర్మానంపై గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ… గిరిజనుల సంస్కృతి రోజురోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇలాంటి గిరిజన ఉత్సవాలు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు దోహదపడతాయని అన్నారు.

బంజారా గిరిజనులు మాట్లాడే గోర్ బోలి భాషకు లిపిని గుర్తించి రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, తిరుపతి నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ నాయక్, గణేష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు వడ్త్యా దాస్ రాం నాయక్, గోవింద్ నాయక్, ఏఐబిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్, కార్యదర్శి బస్కి నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, పద్మ, ప్రొఫెసర్ శంకర్ నాయక్, ప్రొఫెసర్ ఆర్.చంద్రు నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బాల్య నాయక్, వి.రామ్ కుమార్, కృష్ణ నాయక్, ఎస్.కిషన్ నాయక్, ఆర్.పాండు నాయక్, ఎం. గోపి నాయక్, హరి, గోర్ బంజారా ఎంప్లాయిస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.శోభ‌న్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.