జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళిక
– రూ.1,090 కోట్లతో రెండు ప్యాకేజీల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం
– భూసేకరణ, నిర్మాణ వ్యయాల్లో రూ.1,200 కోట్ల వరకు ఆదా చేయనున్నట్లు అంచనా
హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) : కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పరిశీలించారు. వన్‌వే అమలవుతున్న పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ పరిస్థితులు, జంక్షన్ల వద్ద రద్దీని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. గతంలో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు, ఇతర గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. అయితే, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం అమలుతో ఏర్పడిన పరిస్థితులు, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని గతంలో ప్రతిపాదించిన నిర్మాణ ప్రణాళికలను పునఃసమీక్షించి వన్‌వే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. గతంలో చెట్ల తొలగింపునకు సంబంధించిన అనుమతులపై న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్టు రూపకల్పనను పునఃసమీక్షించారు.
సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక :
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విడివిడిగా నిర్మించే అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్లకు బదులుగా సమగ్ర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ ప్రవేశ మార్గం వరకు అధికంగా ఉంటున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిరంతరాయంగా వాహనాలు ప్రయాణించేలా ఈ కారిడార్‌ను రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ( ఈపీసీ ) విధానంలో రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. ఆధునిక స్టీల్ నిర్మాణ సాంకేతికతను వినియోగించడం ద్వారా నిర్మాణ సమయాన్ని తగ్గించి, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రాజెక్టు వివరాలు :
ప్యాకేజీ–1 :
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం.
అంచనా వ్యయం : రూ.580 కోట్లు.
ప్యాకేజీ–2 :
ముగ్ధా జంక్షన్ నుంచి ముఫఖం ఝా కాలేజీ వరకు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం.
బంజారాహిల్స్ రోడ్ నంబర్–1కు ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంపు ఏర్పాటు.
అంచనా వ్యయం: రూ.510 కోట్లు.
మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ.1,090 కోట్లు :
ఈ కారిడార్ సుమారు 4.3 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్లతో, రెండు దిశల్లో వాహనాల రాకపోకలకు అనుగుణంగా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఐదు ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సిగ్నళ్లపై ఆధారపడకుండా వాహనాల రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు.
కేబీఆర్ పార్క్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత :
కేబీఆర్ పార్క్ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో అక్కడి పచ్చదనానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టును అమలు చేయాలని ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు. పార్క్ పరిధిలో నిర్మాణాల ప్రభావం లేకుండా, ఇప్పటికే ఉన్న పచ్చదనాన్ని కాపాడే విధంగా ఎలివేటెడ్ కారిడార్‌ను రూపొందించడం ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన అంశం. మాడ్యులర్ స్టీల్ నిర్మాణ సాంకేతికత ద్వారా పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు, రహదారులపై నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు కలిగే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించాలని భావిస్తున్నారు.
భూసేకరణ, నిర్మాణ వ్యయాల్లో రూ.1,200 కోట్ల ఆదా అంచనా :
సమగ్ర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ద్వారా అధిక విలువ కలిగిన ప్రైవేటు భూముల సేకరణ అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భూసేకరణ వ్యయంలో ఆదా : సుమారు రూ.800 కోట్లు :
నిర్మాణ వ్యయంలో ఆదా : గతంలో ప్రతిపాదించిన పలు అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్ల ప్రణాళికతో పోలిస్తే సుమారు రూ.400 కోట్లు. మొత్తం అంచనా ఆదా : రూ.1,200 కోట్లు. ఈ విధంగా తక్కువ భూసేకరణతో, సమగ్ర నిర్మాణ ప్రణాళిక ద్వారా అధిక సామర్థ్యం కలిగిన ట్రాఫిక్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వాహనదారులకు ప్రయోజనాలు :
ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గించే అవకాశం.
ప్రయాణ సమయం, వాహనాల క్యూ లైన్లు తగ్గింపు.
ఇంధన వినియోగం, వాహన కాలుష్యాన్ని తగ్గించే అవకాశం.
నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ప్రవాహం మెరుగుదల.
కేబీఆర్ పార్క్ పచ్చదనాన్ని పరిరక్షిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి.
ఆధునిక స్టీల్ నిర్మాణ సాంకేతికతతో పనులను వేగవంతం చేసే అవకాశం.![]()